బిక్షమెత్తుకోవడానికైనా సిద్ధమే కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోను.. వడివేలుతో నటించడంపై సోనా సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

నా గౌరవాన్ని తాకట్టు పెట్టి వచ్చే డబ్బు నాకు అస్సలు వద్దు అనే విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను.

బిక్షమెత్తుకోవడానికైనా సిద్ధమే కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోను.. వడివేలుతో నటించడంపై సోనా సంచలన వ్యాఖ్యలు
X

దిశ సినిమా: నటి సోనా హైడెన్ అందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ ఫేమ్ రాబట్టుకున్నారు. మరీ ముఖ్యంగా వడివేలుతో, సునీల్‌తో ఎన్నో చిత్రాల్లో నటించారు. అయితే, గత కొద్దికాలంగా వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్న సోనా, తమిళ సీనియర్ హాస్యనటుడు వడివేలుపై వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల వడివేలు వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఆ నరకం అనుభవించలేకే ఆయనతో సినిమాలు చేయడం మానేశానని చెప్పిన ఆమె.. తాజాగా మరోసారి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. వడివేలు నటనను ప్రశంసిస్తూనే, ఆయన వ్యక్తిత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వడివేలు గారు అద్భుతమైన హాస్యనటుడని, ఆయన బాడీ లాంగ్వేజ్, హాస్యాన్ని పండించే సమయస్ఫూర్తికి ఎవరూ సాటి రారని ప్రపంచం మొత్తానికి తెలుసని ఆమె ప్రశంసించారు.

‘కానీ ఆయన మంచి మనిషా?.. అనే ప్రశ్న వస్తే మాత్రం దీనిపై నేనేమీ చెప్పదలుచుకోలేదు’ అంటూ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆయనతో కలిసి ఏకంగా 16 సినిమాల్లో నటించే భారీ అవకాశాలు తన ముంగిటకు వచ్చినప్పటికీ, వాటన్నింటినీ తానే స్వయంగా తిరస్కరించానని సోనా స్పష్టం చేశారు. అందుకు గల కారణాన్ని వివరిస్తూ.. "నాకు అన్నింటికంటే నా ఆత్మగౌరవం, హుందాతనం చాలా ముఖ్యం. నా గౌరవాన్ని తాకట్టు పెట్టి వచ్చే డబ్బు నాకు అస్సలు వద్దు అనే విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను. నా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించడం కంటే, రోడ్డు పక్కన కూర్చుని భిక్షం ఎత్తుకోవడం మేలు అని నా అభిప్రాయం" అంటూ సోనా ఎంతో ఆవేదనతో, ఘాటుగా స్పందించారు. ఒకప్పుడు వడివేలుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, ఇప్పుడు ఆయన ప్రవర్తనను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

Next Story