ఇలాంటి పనులు చేయడం ఎంత సిగ్గుచేటు.. అభిమానులను హెచ్చరిస్తూ మాధవన్ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |

ఎంత సిగ్గుచేటు! ఇలాంటి సంస్థలు తాము చేస్తున్న తప్పుల నుండి ఎలా తప్పించుకోగలమని భావిస్తున్నాయి?

ఇలాంటి పనులు చేయడం ఎంత సిగ్గుచేటు.. అభిమానులను హెచ్చరిస్తూ మాధవన్ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: నటుడు ఆర్. మాధవన్ ఇటీవల ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రంలో కనిపించారు. ఈ మూవీ భారీ విజయం సాధించడమే కాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాధవన్ యష్ రాజ్ ఫిలిమ్స్ వారి ‘ఆల్ఫా’తో పాటు, తమిళంలో అదృష్టశాలి, జీడీఎన్, ‘సర్కిల్’ అనే బైలింగువల్ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన తన వ్యక్తిగత జీవితంపై, అలాగే తన కొడుకు కెరీర్ విషయంలో తీసుకుంటున్న కీలక నిర్ణయాల గురించి చెప్తూ ఎమోషనల్ అవుతున్నాడు. తాజాగా, మాధవన్ ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఆయన ఒక హెల్త్ బ్రాండ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా, పాత ఇంటర్వ్యూ క్లిప్‌లను వాడుకుంటూ తమ బరువు తగ్గే ప్రోగ్రామ్‌లను ప్రమోట్ చేసుకుంటున్న ‘ఎలివేట్ నౌ’ అనే వెల్నెస్ సంస్థకు ఆయన లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ విషయాన్ని మాధవన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రజలను హెచ్చరించారు. సదరు హెల్త్ బ్రాండ్ మాధవన్ గతంలో మాట్లాడిన ఒక ఫిట్‌నెస్ ఇంటర్వ్యూ వీడియోను, ఫోటోలను వాడుకుంటూ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో యాడ్స్ రన్ చేసిందట.

దీనివల్ల మాధవన్ స్వయంగా ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్న నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై మాధవన్ స్పందిస్తూ "ఎంత సిగ్గుచేటు! ఇలాంటి సంస్థలు తాము చేస్తున్న తప్పుల నుండి ఎలా తప్పించుకోగలమని భావిస్తున్నాయి? ఎవరిదో పాత ఇంటర్వ్యూ క్లిప్ తీసుకుని, దాన్ని మీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌గా ఎలా వాడుకుంటారు?" అని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పటికే సదరు సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్లు స్పష్టం చేసిన ఆయన, ఇలాంటి సంస్థల పట్ల ప్రజలు, అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిజానికి మాధవన్ తన ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి కృత్రిమ పద్ధతులు, మందులు వాడరని ఇండస్ట్రీలో మంచి పేరుంది. కేవలం 21 రోజుల్లోనే ఆయన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ , మితంగా తినడం, క్రమశిక్షణతో కూడిన అలవాట్ల ద్వారా అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ సాధించారు. ఎటువంటి కఠినమైన డైట్లు లేకుండానే కేవలం సహజ పద్ధతుల్లో బరువు తగ్గానని ఆయన గతంలో చెప్పారు. అలాంటి తన వీడియోలను కమర్షియల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌ల కోసం వాడుకోవడంపై ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Next Story