‘కేరళ స్టోరీ-2’ సినిమాపై హైకోర్టు స్టే.. సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-26 09:13:12  IST  )

కేరళ స్టోరీ-2 విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. వివాదాస్పద అంశాలున్న సినిమాకు అనుమతి ఎలా ఇచ్చారని సెన్సార్ బోర్డును కోర్టు ప్రశ్నించింది.

‘కేరళ స్టోరీ-2’ సినిమాపై హైకోర్టు స్టే.. సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘కేరళ స్టోరీ-2’ (Kerala Story-2) విడుదలకు కేరళ హైకోర్టు (Kerala High Court) బ్రేక్ వేసింది. ఈ చిత్రంపై స్టే విధిస్తూ ధర్మాసనం ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాలో సామాజిక, మతపరమైన అంశాలకు సంబంధించి తీవ్ర వివాదాస్పద కంటెంట్ ఉందని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా ఈ సినిమా ప్రదర్శనకు అనుమతులు మంజూరు చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను, సంభాషణలను క్షుణ్ణంగా చూడకుండానే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఎలా ఇచ్చిందని కోర్టు ప్రశ్నించింది. వివాదాస్పద అంశాలు ఉన్నాయని తెలిసినా, సినిమాను సరిగ్గా తనిఖీ చేయకుండానే అనుమతి ఇవ్వడం సరైన పద్ధతి కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సినిమా ప్రదర్శన వల్ల సామాజిక సామరస్యానికి భంగం కలిగే అవకాశం ఉందని భావించిన ధర్మాసనం, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సినిమాను విడుదల చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు (Stay Order) జారీ చేసింది. సెన్సార్ బోర్డు తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చిత్ర యూనిట్‌కు భారీ షాక్ తగిలినట్లయింది. ఈ వివాదంపై తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story