సర్జరీలు చేయించుకోవడంపై కీర్తి సురేష్ రియాక్షన్ ఇదే.. పోస్ట్‌తో నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్

by Mallepaka Hamsa |

2018లో ‘మహానటి’ సినిమా తర్వాత హై-ప్రోటీన్, లో-కార్బ్ ఫుడ్‌తో పాటు విపరీతమైన వర్కవుట్స్ హెచ్‌ఐఐటీ, కార్డియో వ్యాయామాలు చేసి 9 నెలల్లో 10 కిలోలు తగ్గానని కీర్తి చెప్పింది.

సర్జరీలు చేయించుకోవడంపై కీర్తి సురేష్ రియాక్షన్ ఇదే.. పోస్ట్‌తో నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, సినిమా: ‘మహానటి’ సినిమాతో యావత్ భారతదేశాన్ని తన నటనతో మంత్రముగ్ధులను చేసి జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. కెరీర్ తొలినాళ్లలో కాస్త బొద్దుగా ఉన్న కీర్తి.. ఇటీవల కొంత జీరో సైజ్ లుక్‌లో మారిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే గత కొంతకాలంగా ఆమె లుక్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. బొద్దుగా ఉన్న కీర్తి ఒక్కసారిగా జీరో సైజ్ లుక్‌లోకి మారడంతో.. ఆమె అందం కోసం లైపోసక్షన్, బేరియాట్రిక్ వంటి సర్జరీలు చేయించుకుందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి. ఈ రూమర్లపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కీర్తి, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి ట్రోలర్ల నోళ్లు మూయించింది. తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న అసలైన కష్టాన్ని, కన్నీళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. తాను బరువు తగ్గడం వెనుక ఉన్న కష్టాన్ని వివరిస్తూ, 2018లో ‘మహానటి’ సినిమా తర్వాత హై-ప్రోటీన్, లో-కార్బ్ ఫుడ్‌తో పాటు విపరీతమైన వర్కవుట్స్ హెచ్‌ఐఐటీ, కార్డియో వ్యాయామాలు చేసి 9 నెలల్లో 10 కిలోలు తగ్గానని కీర్తి చెప్పింది.

ఆ సమయంలో తను చాలా గర్వంగా ఫీల్ అయ్యానని, కానీ జనాలు మాత్రం తను సర్జరీలు చేయించుకుందని అనడం చూసి బాధ కలిగిందని పేర్కొంది. "నేను ఎప్పుడూ నా ముఖంతో సహా అన్నింటినీ సహజంగానే ఉంచుకున్నాను. నా కష్టమంతా ఒక కత్తి కింద నలిగిపోయిందన్న మాట వినగానే కొంచెం బాధేసింది" అంటూ సర్జరీ పుకార్లను పూర్తిగా కొట్టిపారేసింది. ఆ తర్వాత 2020లో తాను యోగా వైపు మళ్లానని, అది తనకు మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని కీర్తి తెలిపింది. ప్రస్తుతం తన ఫిట్‌నెస్ దినచర్యలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, యానిమల్ ఫ్లో, కాలిస్థెనిక్స్ వంటివి భాగమయ్యాయని చెప్పింది. "మనం బొద్దుగా ఉంటే సన్నగా అవ్వాలంటారు, సన్నగా ఉంటే బొద్దుగా ఉండాల్సింది అంటారు.. ఈ ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అని ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది" అంటూ ఫైర్ అయింది. గత కొన్ని నెలలుగా తాను శారీరకంగా, మానసికంగా కొంత ఎదురుదెబ్బను తిన్నానని, అందుకే అందుబాటులో లేను అని కీర్తి ఓపెన్ అయ్యింది. అయితే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, విరామం తీసుకోవాల్సి వచ్చినా తీసుకుంటాను కానీ.. ఎప్పటికీ వదులుకోను అంటూ రాసుకొచ్చింది. కీర్తి సురేష్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె క్రమశిక్షణను, నిజాయితీని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.

Next Story