'సంపత్ నంది'తో గోపీచంద్.. ముచ్చటగా మూడోసారి

by Pulgam srinivas |

గోపీచంద్-సంపత్ నంది కాంబినేషన్‌లో 'గౌతమ్ నంద', 'సిటిమార్' చిత్రాల తర్వాత ముచ్చటగా మూడో సినిమా రాబోతున్నట్లు సమాచారం.

సంపత్ నందితో గోపీచంద్.. ముచ్చటగా మూడోసారి
X

దిశ, వెబ్ డెస్క్: యాక్షన్ హీరో గోపీచంద్ – దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌కు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మొదటగా వీరిద్దరి కలయికలో వచ్చిన 'గౌతమ్ నంద' చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాలో గోపీచంద్ డ్యూయల్ రోల్‌లో కనిపించి హీరో, విలన్ పాత్రల్లో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత ఈ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సిటీమార్' చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. మహిళా కబడ్డీ క్రీడా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కరోనా సమయంలో థియేటర్లలో విడుదలైనప్పటికీ మంచి ప్రేక్షకాదరణను పొందింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గోపీచంద్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయకపోవడంతో తాత్కాలికంగా 'గోపీచంద్ 33' అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కొనసాగుతోంది. ఇక దర్శకుడు సంపత్ నంది, హీరో శర్వానంద్ తో 'భోగి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరూ తమ తమ ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత గోపీచంద్-సంపత్ నంది కాంబోలో మూడో సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story