ఇకనుంచి అయినా దర్శకనిర్మాతలు స్పృహతో, బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. అనసూయ సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-06 09:27:43  IST  )

సమాజంలో జరిగే ప్రతి తప్పుకు సినిమాలను బాధ్యులను చేయడం సరికాదంటూ ఆమె తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా పంచుకున్నారు.

ఇకనుంచి అయినా దర్శకనిర్మాతలు స్పృహతో, బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. అనసూయ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తున్నారు. తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుత ట్రెండ్‌కు అద్దం పట్టేలా ఉన్న ఆమె పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. సమాజంలో జరిగే ప్రతి తప్పుకు సినిమాలను బాధ్యులను చేయడం సరికాదంటూ ఆమె తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా పంచుకున్నారు. సినిమాల్లో చూపించే కథలు పూర్తిగా కల్పితమని, వాటిని కేవలం వినోద సాధనంగా మాత్రమే చూడాలని అనసూయ పేర్కొన్నారు. ఏది సరైనది, ఏది తప్పు అని నిర్ణయించుకునే విచక్షణ ప్రతి ఒక్కరికీ ఉండాలని ఆమె సూచించారు. ప్రేక్షకులు సినిమాలను కథలుగానే స్వీకరించాలని, వ్యక్తిగత నిర్ణయాలకు, ప్రవర్తనకు ఆయా వ్యక్తులే బాధ్యులని స్పష్టం చేశారు. పిల్లల పెంపకం సినిమాల ద్వారా జరుగుతుందని తాను నమ్మను అంటూ ఆమె ఘాటుగా స్పందించారు.

ఒకప్పటి చిత్రాలకు, ఇప్పటి సినిమాలకు ఉన్న తేడాను వివరిస్తూ.. "గతంలో ప్రేక్షకులు కథలోని నైతిక విలువలను సులభంగా అర్థం చేసుకునేవారు. హీరో మంచి మార్గానికి, విలన్ అనుకరించకూడని చెడు మార్గానికి ప్రతీకగా నిలిచేవారు. కానీ ఈ రోజుల్లో ఆ గీత అస్పష్టంగా మారుతోంది. పాత్రలు మరింత సంక్లిష్టంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు ఒక తప్పుడు పాత్రను కేవలం చిత్రించడానికి , దాన్ని గొప్పగా కీర్తించడానికి మధ్య తేడా తెలియకుండా పోతోంది" అని అనసూయ అభిప్రాయపడ్డారు. ఇకనైనా కంటెంట్ సృష్టించే దర్శకులు, నిర్మాతలు, నటించే నటీనటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, చూసే ప్రేక్షకులు అందరూ కొంచెం ఎక్కువ సామాజిక స్పృహతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనసూయ కోరారు. ఇది ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే సమయం కాదని, మనమందరం ఒకే జీవ వ్యవస్థలో భాగమని గుర్తించాలని చెప్పారు. మనం రూపొందించే సంస్కృతి అంతిమంగా మనందరి సామూహిక బాధ్యత అని గ్రహించాలని అన్నారు.

Next Story