సినిమా అంటే నమ్మకం, కష్టం.. 'జననాయకన్' లీక్‌పై మెగాస్టార్ ఎమోషనల్ పోస్టు

by Pulgam srinivas |

చిరంజీవి మాట్లాడుతూ... జననాయగన్ సినిమా లీక్ అవడం ఎంతో బాధ కలిగించే విషయం అని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సినిమా అంటే నమ్మకం, కష్టం.. జననాయకన్ లీక్‌పై మెగాస్టార్ ఎమోషనల్ పోస్టు
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ తాజాగా జననాయగన్ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, హెచ్ వినోత్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులను కూడా పూర్తి చేశారు. అయితే చివరి నిమిషంలో కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికీ ఈ సినిమా విడుదల కాకపోవడంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆన్లైన్‌లో లీక్ కావడం పెద్ద సంచలనంగా మారింది. దీంతో కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. చిరంజీవి మాట్లాడుతూ... జననాయగన్ సినిమా లీక్ అవడం ఎంతో బాధ కలిగించే విషయం అని, సినిమా అనేది నమ్మకం, కష్టం, ఎంతోమంది కలల సమాహారం అని పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలు కేవలం ఒకరినే కాదు, పరిశ్రమలో ఉన్న అందరినీ ప్రభావితం చేస్తాయని, తమ సృజనాత్మక కృషిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేస్తున్నాయని చెప్పారు. అలాగే ఈ ఘటన వల్ల జరిగిన నష్టాన్ని తగ్గించడానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థకు తాము పూర్తి మద్దతుగా ఉంటామని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చివరిగా పైరసీని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని, సినిమా పరిశ్రమను కాపాడేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 'పైరసీని చంపండి... సినిమాను కాపాడండి' అంటూ చిరంజీవి తన సందేశాన్ని ముగించారు.

Next Story