ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య

by Ramesh Naini |

ప్రముఖ తమిళ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణన్ (73) దారుణ హత్యకు గురయ్యారు.

ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ తమిళ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణన్ (73) దారుణ హత్యకు గురయ్యారు. తమిళనాడులోని దిండిగల్ జిల్లా, కొడైకెనాల్‌లోని ఆయనకు సొంతమైన గెస్ట్ హౌస్‌లో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యనారాయణన్ కొడైకెనాల్‌లో ఒక విలాసవంతమైన బంగ్లాను నిర్వహిస్తూ, దానిని పర్యాటకులకు అద్దెకు ఇస్తుంటారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఐదుగురు యువకులు ఆ గెస్ట్ హౌస్‌లో అద్దెకు దిగారు. సూర్యనారాయణన్ వద్ద భారీగా నగదు, నగలు ఉన్నాయని గమనించిన నిందితులు దోపిడీకి స్కెచ్ వేశారు. శనివారం రాత్రి ఇంట్లోని పనివారైన అరుముగం, మురళిలను తాళ్లతో కట్టేసి, సూర్యనారాయణన్‌ను కుర్చీకి బంధించారు. ఆయన నోరు, ముఖంపై టేప్‌ను గట్టిగా చుట్టేయడంతో ఊపిరాడక ఆయన ప్రాణాలు కోల్పోయారు.

నగదు, నగలతో పరార్..

హత్య అనంతరం నిందితులు ఇంట్లో ఉన్న భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను దోచుకెళ్లారు. అంతేకాకుండా, తాము దొరికిపోకూడదనే ఉద్దేశంతో అక్కడి సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను కూడా తీసుకుని పారిపోయారు. ఈ కేసులో పోలీసులు మరో కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. 2018లో నటి విష్ణుప్రియ ప్రియుడు ప్రభాకరన్ హత్యకు గురైన ఘటనలో సూర్యనారాయణన్ నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు జరిగిన హత్య ఆనాటి పాత కక్షల వల్ల జరిగిందా? లేక కేవలం దోపిడీ కోసమే చేశారా? అనే కోణంలో జిల్లా ఎస్పీ నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది. కాగా, తమిళ స్టార్ హీరో సూర్య, జ్యోతిక జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మాయావి’లో విష్ణుప్రియ కీలక పాత్రలో నటించారు. తన తండ్రి ఇలా దారుణంగా హత్యకు గురవ్వడంతో ఆమె కుటుంబం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story