ఫెయిల్యూర్లు నాకు కొత్త కాదు.. సత్యదేవ్ సంచలన వ్యాఖ్యలు

by Pulgam srinivas |

నాకు ఫెయిల్యూర్లు కొత్తవి కావు.. విజయాలే కొత్తవి అంటూ సత్యదేవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఫెయిల్యూర్లు నాకు కొత్త కాదు.. సత్యదేవ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో సత్యదేవ్ ఒకరు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'రావు బహదూర్' చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యదేవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సత్యదేవ్ మాట్లాడుతూ... "నాకు ఫెయిల్యూర్లు కొత్తవి కావు.

ఇప్పటివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. వాటిలో చాలా తక్కువ సినిమాలే విజయాన్ని అందుకున్నాయి. అయితే ప్రతి సినిమా కోసం నా వంతు కృషి మాత్రం పూర్తిగా చేస్తాను. సినిమా పూర్తయ్యాక ఇది పెద్ద హిట్ అవుతుందని చాలామంది చెప్పారు. ఆ మాటలు విని నేను కూడా చాలా సంతోషపడి, పెద్ద విజయాన్ని ఊహించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ విడుదల తర్వాత ఫలితం మాత్రం అలా రాలేదు. నిజానికి నాకు ఫెయిల్యూర్ల కంటే విజయాలే కొత్తవి.

ఎందుకంటే అవి చాలా తక్కువగా వచ్చాయి. అయితే 'రావు బహదూర్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహించగా, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర అంకారాజు, చింతా గోపాలకృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని జి.ఎమ్.బి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పించారు.

Next Story