అందమైన అమ్మాయిలు నన్ను ఆకర్షించినా.. నా భార్యను మోసం చేయను: మాధవన్

by Mallepaka Hamsa |

భార్యకు అన్యాయం చేసి, ఆ తర్వాత వచ్చే గొడవలు, పరిణామాలకు సాకులు వెతుక్కునే ఇబ్బందులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని నవ్వుతూ చెప్పారు.

అందమైన అమ్మాయిలు నన్ను ఆకర్షించినా.. నా భార్యను మోసం చేయను: మాధవన్
X

దిశ, సినిమా: స్టార్ నటుడు మాధవన్ త్వరలో ‘జీడిఎన్ నాయుడు’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. భారతదేశపు ఎడిసన్‌గా, మిరాకిల్ మేన్‌గా ప్రసిద్ధి చెందిన గొప్ప ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జీడీ నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా రాబోతుండగా కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్, ప్రియమణి, జయరామ్, దుషారా విజయన్, యోగిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని జూలై 17న విడుదలకు సిద్ధమైంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న మాధవన్ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి పంచుకుంటున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాధవన్ తన భార్య సరితపై ఉన్న ప్రేమాభిమానాలను బయటపెట్టారు. తాను వెండితెరపై ఎంతమంది హాట్ బ్యూటీస్‌తో రొమాన్స్ చేసినప్పటికీ, నిజ జీవితంలో తన భార్యను మోసం చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని స్పష్టం చేశారు. తాను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడినని, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం భయస్తుడినని పేర్కొన్నారు.

షూటింగ్స్‌లో అందమైన అమ్మాయిలు తనను ఆకర్షించినా.. భార్యకు అన్యాయం చేసి, ఆ తర్వాత వచ్చే గొడవలు, పరిణామాలకు సాకులు వెతుక్కునే ఇబ్బందులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని నవ్వుతూ చెప్పారు. రోజు ముగిసేసరికి ఎలాంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా తన భార్య దగ్గరకు వెళ్లడమే తనకు ఇష్టమని, దేవుడు ఇచ్చిన ఒకే ఒక్క మంచి భార్య తనకు చాలని మాధవన్ ఎమోషనల్ అయ్యారు. తమ బంధంలో ఎలాంటి దాపరికాలు లేవని, తన ఫోన్ పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్నీ భార్య దగ్గరే ఉంటాయని చెప్పారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కెరీర్ దెబ్బతింటుందని పెళ్లి విషయాన్ని దాచమని కొందరు సలహా ఇచ్చినప్పటికీ, తాను మాత్రం గర్వంగా ప్రకటించానని గుర్తుచేసుకున్నారు. షూటింగ్స్ కోసం ఎక్కడికి వెళ్లినా భార్యను కూడా తనతో పాటే తీసుకెళ్తానని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అయిపోయాయి. అంతేకాకుండా కొందరు ఎఫైర్స్ కూడా పెట్టుకుంటున్న తరుణంలో, మాధవన్ తన భార్య గురించి ఇంత గొప్పగా చెప్పడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story