- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran-Israel War: యుద్ధ మేఘాల మధ్య ‘డ్రాగన్’ షూటింగ్.. చివరి నిమిషంలో ఎన్టీఆర్ సేఫ్!
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భీకర పోరుతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుండగా ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'డ్రాగన్' చిత్ర యూనిట్ తృటిలో పెను ముప్పు నుంచి తప్పించుకున్నట్లైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు టాలీవుడ్‌ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భీకర పోరుతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుండగా, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'డ్రాగన్' చిత్ర యూనిట్ తృటిలో పెను ముప్పు నుంచి తప్పించుకున్నట్లైంది. గత కొన్ని రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రతిదాడులతో పరిస్థితులు యుద్ధానికి దారితీశాయి. అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ దాడులు చేయడంతో, భద్రతా కారణాల దృష్ట్యా జోర్డాన్, ఇరాక్, యూఏఈ వంటి దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా భారతీయులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ బృందం జోర్డాన్‌లో షూటింగ్‌లో ఉండటంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
దర్శకుడి ముందస్తు జాగ్రత్త..
నిజానికి ఈ షెడ్యూల్ మార్చి మొదటి వారం వరకు కొనసాగాల్సి ఉంది. అయితే, అక్కడి మారుతున్న రాజకీయ పరిణామాలను, యుద్ధ వాతావరణాన్ని ముందే పసిగట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ అప్రమత్తమైనట్లు తెలిసింది. ప్లాన్ చేసిన దానికంటే ముందే పనులను వేగవంతం చేసి, ఫిబ్రవరి 22నే షూటింగ్ ముగించుకుని చిత్ర యూనిట్‌తో కలిసి ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యారు. ఒకవేళ మరో నాలుగు రోజులు ఆలస్యమై ఉంటే, విమాన రాకపోకలు నిలిచిపోయి వందలాది మంది చిత్ర సభ్యులతో పాటు ఎన్టీఆర్ కూడా అక్కడే చిక్కుకుపోయే పరిస్థితి ఉండేదని టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎడారిలో భారీ యాక్షన్ సీక్వెన్స్..!
ఈ జోర్డాన్ షెడ్యూల్‌లో సినిమాకే అత్యంత కీలకమైన ఘట్టాలను చిత్రీకరించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జోర్డాన్ ఎడారి ప్రాంతాల్లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ఎన్టీఆర్ డూప్ లేకుండా స్వయంగా చేశారని తెలుస్తోంది. ఒక భారీ బడ్జెట్ సాంగ్‌ను కూడా అక్కడి అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశారని సమాచారం. ఎన్టీఆర్ సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై జరగబోయే షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్న ఈ చిత్రం 2026, జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.






