నిర్మాతను ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ సలహాతో బాలయ్య చేసిన సినిమా ఏదో మీకు తెలుసా?

by Pulgam srinivas |

హరికృష్ణ అనే నిర్మాతకు నష్టాలు రావడంతో ఎన్టీఆర్, బాలకృష్ణను తన బ్యానర్‌లో తక్కువ ఖర్చుతో సినిమా చేయడానికి సూచించాడు. దానితో ఇన్స్పెక్టర్ ప్రతాప్ అనే మూవీని రూపొందించగా అది మంచి విజయం సాధించి హరికృష్ణకు లాభాలు తెచ్చింది.

నిర్మాతను ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ సలహాతో బాలయ్య చేసిన సినిమా ఏదో మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డిస్క్ : నందమూరి తారక రామారావు వారసులలో ఒకరైన బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలు అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక ఒకానొక సమయంలో తన తండ్రి రామారావు సూచించాడని ఓ నిర్మాతను కష్టాల్లో నుంచి బయటపడేయడానికి తక్కువ పారితోషికంతో బాలకృష్ణ ఓ సినిమా చేశాడు. ఆ సినిమా ఏది? ఎందుకు రామారావు, బాలకృష్ణను తక్కువ పారితోషికంతో సినిమా చేయాలని సూచించాడు అనే వివరాలను తెలుసుకుందాం.

వై. హరికృష్ణ అనే నిర్మాత సినిమా పరిశ్రమలోకి చిరుద్యోగిగా ప్రవేశించి ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్గా అనేక సినిమాలను పంపిణీ చేసి, నిర్మాతగా మారి ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించారు. ఈయన కళ్యాణ తాంబూలం అనే సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం వల్ల పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చాయి. ఆ విషయం ఎన్టీఆర్ గారికి తెలిసిందట. ఎన్టీఆర్ కి హరికృష్ణ చాలా కావలసిన వ్యక్తి. దాంతో తనకు కావలసిన వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడనే ఉద్దేశంతో ఆయనకు ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాడట. దానితో హరికృష్ణ బ్యానర్లో బాలకృష్ణతో సినిమా చేయించాలని అనుకున్నాడట. కానీ అప్పటికి బాలకృష్ణ అనేక సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఆయన డేట్స్ దొరకడం అత్యంత కష్టంగా ఉంది. అలాంటి సమయంలో ఎన్టీఆర్, బాలకృష్ణను హరికృష్ణ మనకు కావలసినవాడు, ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నాడు, ఆయనకు నువ్వు తక్కువ పారితోషికంతో ఒక సినిమా చేస్తే బాగుంటుందని సూచించాడట. దాంతో బాలకృష్ణ కూడా హరికృష్ణను పిలిచి నేను మీకు సినిమా చేస్తాను, తక్కువ బడ్జెట్లో చేస్తాను, నాకు ఇచ్చే పారితోషికంలో కూడా చాలా వరకు తగ్గిస్తాను అని చెప్పాడట. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఇన్స్పెక్టర్ ప్రతాప్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో హరికృష్ణ అప్పుల్లోంచి బయటకు వచ్చాడట.

Next Story