Dhurandhar 2: ఒకే సీన్ కోసం వందల లీటర్ల పెట్రోలు.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ టెక్నీషియన్

by Pulgam srinivas |

విశాల్ త్యాగి మాట్లాడుతూ.. ‘ధరంధర్: ది రివెంజ్’ క్లైమాక్స్ సన్నివేశం కోసం 500 లీటర్ల పెట్రోల్‌తో పాటు కొన్ని పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు తెలిపారు.

Dhurandhar 2: ఒకే సీన్ కోసం వందల లీటర్ల పెట్రోలు.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ టెక్నీషియన్
X

దిశ, వెబ్ డెస్క్: రణ్‌వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్‌గా రూపొందిన ‘ధరంధర్’, ‘ధరంధర్: ది రివెంజ్’ ఈ రెండు సినిమాలు కలిపి ఏకంగా ₹3,000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది మార్చి 19న విడుదలైన ‘ధరంధర్: ది రివెంజ్’ సినిమా ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శించబడుతూ భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశానికి ప్రేక్షకులు, విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ క్లైమాక్స్ సన్నివేశంలో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు, తుపాకీ శబ్దాలు ఉండగా, వాటిని చాలా నేచురల్‌గా చిత్రీకరించారు.

ఈ సన్నివేశం ఇంత అద్భుతంగా రావడానికి గల కారణాలను స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ విశాల్ త్యాగి వెల్లడించారు. విశాల్ త్యాగి మాట్లాడుతూ.. ఈ క్లైమాక్స్ సన్నివేశాన్ని డిజైన్ చేసిన తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ తనతో మాట్లాడుతూ, ఈ సన్నివేశంలో ఎలాంటి గ్రాఫిక్స్ ఉండకూడదని, అన్నీ సహజంగానే ఉండాలని సూచించారని తెలిపారు. అందుకు తగినట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. చివరి బ్లాస్ట్ సీన్ కోసం ప్రత్యేకంగా చాలా కష్టపడ్డామని, హీరో భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ సన్నివేశం కోసం మొదట 250 లీటర్ల పెట్రోల్ వాడాలని అనుకున్నప్పటికీ, చివరికి 500 లీటర్ల పెట్రోల్‌తో పాటు కొన్ని పేలుడు పదార్థాలను ఉపయోగించి ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ సన్నివేశం పూర్తయిన తర్వాత రణ్‌వీర్ సింగ్ తమ పనితీరును ఎంతో ప్రశంసించారని విశాల్ త్యాగి చెప్పుకొచ్చారు.

Next Story