హనీ సింగ్ ‘వ్యాల్యూమ్‌ 1’పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. పాటను తక్షణమే తొలగించాలని ఆదేశాలు

by Ramesh Naini |

ప్రముఖ ర్యాపర్లు హనీ సింగ్, బాద్‌షా పాడిన ‘వ్యాల్యూమ్‌ 1’ (Volume 1) పాటపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హనీ సింగ్ ‘వ్యాల్యూమ్‌ 1’పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. పాటను తక్షణమే తొలగించాలని ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ర్యాపర్లు హనీ సింగ్, బాద్‌షా పాడిన ‘వ్యాల్యూమ్‌ 1’ (Volume 1) పాటపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను కించపరిచేలా, అత్యంత అసభ్యకరంగా ఉన్న ఈ పాటను సామాజిక మాధ్యమాలు, ఇతర అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది. హిందూ శక్తి దళ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ పురుషేంద్ర కౌరవ్ ధర్మాసనం.. ఈ పాటలోని పదజాలం కోర్టును తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. కనీసం తీర్పు (ఆర్డర్) కాపీలో కూడా ఆ పాట పేరు రాయలేనంత అసభ్యంగా ఉందని న్యాయస్థానం మండిపడింది.

ముంబై కాన్సర్ట్‌లోనూ వివాదాలు..

మరోవైపు, మార్చి 28న ముంబైలోని ఎంఎంఆర్డీఏ గ్రౌండ్స్‌లో జరిగిన హనీ సింగ్ సంగీత విభావరిలోనూ పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఎయిర్‌పోర్టుకు సమీపంలోని నిషిద్ధ ప్రాంతంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించి లేజర్ లైట్లను ఉపయోగించినందుకు ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే కాన్సర్ట్‌లో ఓ మహిళా అభిమాని గేటు దూకి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించింది. భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో సదరు మహిళ తీవ్ర ఆగ్రహంతో దుర్భాషలాడిన ఘటన కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, హనీ సింగ్ ‘మై స్టోరీ వరల్డ్ టూర్’ మార్చి 14న (2026) ఢిల్లీలో ప్రారంభమైంది. ముంబై తర్వాత ఆయన పూణే, కోల్‌కతా నగరాల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అయితే ముంబై కాన్సర్ట్‌లో కూడా హనీ సింగ్ ఈ వివాదాస్పద పాటను పాడటం గమనార్హం.

Next Story