Jana Nayagan : జన నాయగన్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సెన్సార్ బోర్డు

by Ramesh Naini |

టీవీకే పార్టీ అధినేత, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Jana Nayagan : జన నాయగన్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సెన్సార్ బోర్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీవీకే పార్టీ అధినేత, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమా విడుదల విషయంలో జోక్యానికి అత్యున్నత న్యాయస్థానం ఇటీవల నిరాకరించింది. అయినా సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ (సీబీఎఫ్‌సీ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), ముందు జాగ్రత్తగా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా ఈ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని సెన్సార్ బోర్డు తన పిటిషన్‌లో కోరింది.

హైకోర్టులో అసలేం జరిగింది?

ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టులో గత కొన్ని రోజులుగా ఉత్కంఠభరిత వాదనలు జరిగాయి. జనవరి 9న ఈ చిత్రానికి 'U/A 16+' సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి బెంచ్ సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ CBFC దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఆదేశాలను పక్కన పెట్టింది. సెన్సార్ బోర్డు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు తగిన సమయం ఇవ్వకుండానే తీర్పు ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. అలాగే, నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ విధానం (Mandamus) కూడా సరిగ్గా లేదని కోర్టు అభిప్రాయపడింది.

నిర్మాతలకు మరో అవకాశం..

అయితే, పిటిషన్‌ను పూర్తిగా కొట్టేయకుండా, తమ అభ్యర్థనను (Prayer) సవరించుకునేందుకు కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు హైకోర్టు అవకాశం కల్పించింది. కేసును తిరిగి విచారించాలని సింగిల్ జడ్జికి సూచించింది. కాగా, ముందుగా ప్రకటించిన ప్రకారం 'జన నాయగన్' ఈ నెల 9న విడుదల కావాల్సి ఉంది. కానీ, సెన్సార్ బోర్డు సూచించిన కోతలు (Cuts), సర్టిఫికేషన్ ప్రక్రియలో తలెత్తిన న్యాయ వివాదాల కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు సెన్సార్ బోర్డు సుప్రీంకోర్టులో కేవియట్ వేయడంతో, నిర్మాతలు తదుపరి అడుగు ఎలా వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Next Story