‘పెద్ది’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బిగ్ బాస్ అర్జున్

by Pulgam srinivas |

బిగ్ బాస్ అర్జున్ మాట్లాడుతూ… పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారు అన్ని అంశాల్లోనూ అద్భుతంగా కనిపిస్తారని తెలిపారు.

‘పెద్ది’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బిగ్ బాస్ అర్జున్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఆయన ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాడు? అనే ప్రశ్నలు అనేకమందిలో మెదులుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్న బిగ్ బాస్ అర్జున్ పాత్రికేయులతో ముచ్చటించారు. అందులో భాగంగా పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర స్వభావం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది.

దానికి అర్జున్ స్పందిస్తూ… పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉంటుంది అని ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం అని అన్నారు. రామ్ చరణ్ అద్భుతమైన బాడీ గురించి మాట్లాడితే వెంటనే ధృవ సినిమా గుర్తుకు వస్తుందని, నటన గురించి చెప్పాలంటే రంగస్థలం గుర్తుకు వస్తుందని తెలిపారు. అలాగే రామ్ చరణ్ చాలా అందంగా కనిపించిన సినిమా ఏది అంటే చాలామంది ఆరెంజ్ సినిమా పేరు చెబుతారని చెప్పారు. అయితే పెద్ది సినిమాలో మాత్రం ఒకటి మాత్రమే కాదు, అన్ని అంశాల్లోనూ రామ్ చరణ్ అద్భుతంగా కనిపిస్తారని అర్జున్ తెలిపారు.

ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత “ఇది మాత్రం మిస్ అయింది” అనే ఫీలింగ్ ఏ ప్రేక్షకుడికీ రాదని, ఆ స్థాయిలో దర్శకుడు బుచ్చిబాబు గారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పారు. అలాగే రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ఆ విజన్‌కు పూర్తి న్యాయం చేస్తున్నారని అర్జున్ వెల్లడించారు. ఇక పెద్ది చిత్రంలో అర్జున్ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే నటుడిగా అర్జున్‌కు కూడా మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

Next Story