- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది రాజకీయ యాత్ర కాదు సంకల్ప యాత్ర.. బండ్ల గణేష్
'సంకల్ప యాత్ర' దేవుడు నా కోరిక తీర్చినందుకు మొక్కు తీర్చుకోవడానికి చేస్తున్న పాదయాత్ర. నేను వేసే ప్రతి అడుగు చంద్రబాబు గారి ప్రతి అభిమాని అడుగు: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్

దిశ, సినిమా : షాద్‌నగర్ నుంచి తిరుమలకు 'సంకల్ప యాత్ర' ప్రారంభించారు బండ్ల గణేశ్. ''సంకల్ప యాత్ర.. ఇది రాజకీయ యాత్ర కాదు. దైవ సంకల్పం. దేవుడికి మొక్కుకున్న మొక్కు. దేవుడు నా కోరిక తీర్చినందుకు రుణం తీర్చుకోవడానికి చేస్తున్న యాత్ర' అని క్లారిటీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సంకల్ప యాత్ర.. ఇది రాజకీయ యాత్ర కాదు. దైవ సంకల్పం. దేవుడికి మొక్కుకున్న మొక్కు. దేవుడు నా కోరిక తీర్చినందుకు ఆయన రుణం తీర్చుకోవడానికి చేస్తున్న యాత్ర. ఇది రాజకీయ యాత్ర కాదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నా షాద్ నగర్ ప్రజలు, నాకు ఈ స్థాయి ఇచ్చి, నా జీవితానికి అర్థం చెప్పి, నేనున్నానని ముందుకు నడిపించిన దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను అడుగు ముందుకు వేస్తున్నాను. చిరంజీవి గారిని చూడాలని హైదరాబాద్ కు వెళ్లాను. ఈరోజు ఆయన నటించిన సినిమా నా ధియేటర్లో ఆడుతుంది. నేను పాదయాత్ర మొదలు పెడుతున్నాను ఇది భగవంతుని ఆశీస్సులుగా భావిస్తున్నాను.
నాకు ఉదయం 4 గంటలకే నిద్ర లేచే అలవాటుంది. ఆ రోజు టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్త చూడగానే షాక్‌కి గురయ్యాను. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు గారు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడమేంటని ఆశ్చర్యపోయాను. గుంటూరుకు తీసుకొచ్చి బెయిల్ ఇస్తారనుకున్నాను. రాజమండ్రి జైలుకు పంపించారు. రోజులు గడిచేకొద్దీ నాకు టెన్షన్ మొదలైంది. జైల్లో చంద్రబాబు గారికి ఏమన్నా అవుతుందా అనే భయమేసింది. ప్రతిక్షణం ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురుచూశాను. కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా నేను సుప్రీంకోర్టుకు వెళ్లాను. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందనే వార్త మొదట వినడానికే దిల్లీ వెళ్లి కూర్చునేవాడిని. జైలు నుంచి ఆయన తిరిగివస్తే నా గడప నుంచి వెంకన్న గడపకు పాదయాత్రగా వస్తానని ఏడుకొండలవాడిని మొక్కుకున్నా. దేవుడి ఆశీస్సులతో 52 రోజుల తర్వాత మహానేత చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాడి గర్వం లాగా తెలుగు వాడి తేజస్సు లాగా బయటకు వస్తుంటే ఆయన్ని చూసిన ఉత్సాహం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆయన లాంటి వ్యక్తి తెలుగు జాతికి కావాలని మొక్కుకుని ఆ మొక్కు తీర్చుకోడానికి ఈరోజు పాదయాత్ర చేస్తున్నాను. ఈ యాత్రను రాజకీయంగా చూడొద్దు. విమర్శలు చేయొద్దు. నేను వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు. జై చంద్రబాబు.. ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామికి, నా షాద్ నగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు అభిమానం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.






