Amani: ఈ పిచ్చి సినిమాను ఎవరు చూస్తారు అన్నారు.. కట్ చేస్తే బ్లాక్‌బస్టర్

by Pulgam srinivas |

'జంబలకిడి పంబ' విడుదలకు ముందు ఎవరూ చూడరని భావించానని సీనియర్ నటి ఆమని వెల్లడించారు.

Amani: ఈ పిచ్చి సినిమాను ఎవరు చూస్తారు అన్నారు.. కట్ చేస్తే బ్లాక్‌బస్టర్
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటి ఆమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన కెరీర్‌లో ఎదురైన ఓ ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. ఆమని మాట్లాడుతూ.. "నేను అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతాను. ఎందుకంటే నేను నటించిన ఎన్నో సినిమాల్లో కథ బాగున్నప్పటికీ కొన్ని చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేదు. మరోవైపు, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం ఘన విజయాలు సాధించాయి. నా కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో 'జంబలకిడి పంబ' ఒకటి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో 'అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా మారే ఇలాంటి పిచ్చి కాన్సెప్ట్‌తో సినిమా తీస్తే ఎవరు చూస్తారు?' అంటూ చాలామంది వ్యాఖ్యానించేవారు.

బయట మాత్రమే కాదు, షూటింగ్ స్పాట్‌లో కూడా ఇలాంటి గుసగుసలు వినిపించేవి. వాటితో నేను చాలా ఆందోళన చెందాను. సినిమా పూర్తయ్యాక కొంతమందికి చూపించినా వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమా ఆడదని, ప్రేక్షకులను మెప్పించలేదని నేను కూడా అనుకున్నాను. కానీ సినిమా విడుదలైన తర్వాత అద్భుతమైన ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. నేటికీ అది ఓ క్లాసిక్ చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది" అని ఆమని తెలిపారు. కాగా, 'జంబలకిడి పంబ' చిత్రంలో నరేష్ హీరోగా నటించగా, ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

Next Story