రిటైర్‌‌మెంట్ తీసుకోవడంపై స్పందించిన అక్షయ్ కుమార్.. ప్రతిరోజు అదే ఆలోచన అంటూ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

నా దృష్టిలో పదవీ విరమణ అనే పదం పూర్తిగా తప్పు. ఒక మనిషి తను చనిపోవడానికి కేవలం 5 సెకన్ల ముందు మాత్రమే రిటైర్ అవ్వాలి.

రిటైర్‌‌మెంట్ తీసుకోవడంపై స్పందించిన అక్షయ్ కుమార్.. ప్రతిరోజు అదే ఆలోచన అంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్ కుమార్ త్వరలో ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 26న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా.. ఇందులో భాగంగా కొందరు ఇకనైనా సినిమాల వేగాన్ని తగ్గిస్తారా? అసలు మీ రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటి? అని ప్రశ్నించగా.. అక్షయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన తనకు అస్సలు లేదని స్పష్టం చేశారు. "నా దృష్టిలో పదవీ విరమణ అనే పదం పూర్తిగా తప్పు. ఒక మనిషి తను చనిపోవడానికి కేవలం 5 సెకన్ల ముందు మాత్రమే రిటైర్ అవ్వాలి. మీరు ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవించాలనుకుంటే.. విశ్రాంతి గురించి ఆలోచించకుండా ఎప్పుడూ కష్టపడి పని చేస్తూనే ఉండాలి" అని చెప్పారు.

గత 36 ఏళ్లుగా ఇదే దినచర్యను కొనసాగిస్తున్నట్లు చెప్పిన అక్షయ్.. "ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే, ఈరోజు షూటింగ్‌కు వెళ్లకుండా కాస్త విరామం తీసుకుంటే బాగుండు అని నాకూ అనిపిస్తుంది. కానీ, సెట్‌లో నా కోసం వేచి చూసే 300 మంది సిబ్బంది ముఖాలు గుర్తుకురాగానే ఆ ఆలోచన కొన్ని క్షణాల్లోనే మాయమైపోతుంది. నేను చేయాల్సిన పని ఇంకా చాలా ఉందనే బాధ్యత నన్ను ముందుకు నడిపిస్తుంది" అని తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు. అలాగే తన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి గురించి సరదాగా స్పందిస్తూ.. "ఒకవేళ నేను గనుక సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లోనే కూర్చుంటే.. మా ఇంట్లో ఎలక్ట్రీషియన్‌గానో, డాగ్ వాకర్‌గానో, తోటమాలిగానో లేదా ఇంటి పనులన్నీ చూసుకునే పనిమనిషిగానో మారిపోతాను. అందుకే వాటన్నింటికంటే ప్రశాంతంగా సినిమా షూటింగ్‌కు వెళ్లడమే నాకు చాలా మంచి ఆప్షన్" అని సరదాగా చెప్పుకొచ్చారు.

Next Story