Ajay Ghosh: మహేష్, రవితేజ అలా పిలుస్తారు.. ‘రంగస్థలం’ హిట్‌తో ఊర్లో ఆ పని చేశాను

by Pulgam srinivas |

అజయ్ ఘోష్ మాట్లాడుతూ... టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రవితేజ, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తనను ఎంతో ఆప్యాయంగా పిలుస్తారని, అలాగే రంగస్థలం సినిమాతో వచ్చిన ఆదాయంతో తన సొంత ఊరిలో ఇల్లు కట్టుకున్నట్లు తెలిపారు.

Ajay Ghosh: మహేష్, రవితేజ అలా పిలుస్తారు.. ‘రంగస్థలం’ హిట్‌తో ఊర్లో ఆ పని చేశాను
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన జోష్‌తో కెరీర్‌ను ముందుకు సాగిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అజయ్ ఘోష్ ఒకరు. ఈయన శర్వానంద్ హీరోగా రూపొందిన ప్రస్థానం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు ఈయన కెరీర్ పెద్దగా ఊపందుకోలేదు. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలాంటి సమయంలో రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో ముఖ్య పాత్రలో నటించే అవకాశం లభించింది.

ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడం, ఇందులో ఆయన పోషించిన పాత్రకు ప్రశంసలు లభించడం వల్ల ఒక్కసారిగా అజయ్ ఘోష్‌కు భారీ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇటీవల తిరువీర్ ప్రధాన పాత్రలో రూపొందిన పాపం ప్రతాప్ చిత్రంలో కూడా అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా అజయ్ ఘోష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ స్టార్ హీరోలు తనతో ఎలా మెలుగుతారనే విషయంతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అజయ్ ఘోష్ మాట్లాడుతూ... రవితేజ గారితో ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను. ఆయన నాతో చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ నన్ను ‘బాబాయి’ అని పిలుస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు గారు కూడా నన్ను ‘బాబాయి’ అని పిలుస్తారు. అల్లు అర్జున్ ‘ఘోష్ గారు’ అని, రామ్ చరణ్ ‘అజయ్ ఘోష్ గారు’ అని పిలుస్తారు” అని తెలిపారు. అలాగే రంగస్థలం సినిమా తన కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చిందని, ఆ సినిమా విజయంతో వచ్చిన ఆదాయంతో తన సొంత ఊరిలో ఒక ఇల్లు నిర్మించుకున్నానని అజయ్ ఘోష్ వెల్లడించారు.

Next Story