కథలో లేకపోయినా పదే పదే ముద్దులు.. సెట్‌లో నటికి వేధింపులు

by Gantepaka Srikanth |

మరాఠీ చిత్రసీమతో పాటు హిందీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి ప్రియా బాపట్ షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని బహిర్గతం చేశారు.

కథలో లేకపోయినా పదే పదే ముద్దులు.. సెట్‌లో నటికి వేధింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: మరాఠీ చిత్రసీమతో పాటు హిందీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి ప్రియా బాపట్ షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని బహిర్గతం చేశారు. కెరీర్ ఆరంభంలో ఒక సినిమా చిత్రీకరణ సమయంలో, సహనటుడు మితిమీరి ప్రవర్తించాడని, కథలో లేకపోయినప్పటికీ షూటింగ్ స్పాట్‌లో తనను పదే పదే ముద్దు పెట్టుకుంటూ తీవ్ర ఇబ్బందికి గురిచేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రియా బాపట్ తన కెరీర్‌లోని అత్యంత అసౌకర్యవంతమైన ఘట్టాన్ని పంచుకున్నారు. 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు రాకముందు ఈ ఘటన జరిగిందని ఆమె పేర్కొన్నారు. సదరు చిత్ర స్క్రిప్ట్ రీడింగ్ దశ నుంచే అందులోని ఒక ముద్దు సీన్లపై తనకు కొన్ని అభ్యంతరాలు, సందేహాలు ఉన్నట్లు ఆమె తెలిపారు.

"కథా పరంగా ఆ సన్నివేశానికి ఉన్న ప్రాధాన్యత ఏంటని నేను దర్శకుడిని కూడా ప్రశ్నించాను. నా వ్యక్తిగత బిడియాన్ని పక్కన పెట్టి, కథకు అవసరమైతే నటించాలనే ఉద్దేశంతో చివరికి ఆ సీన్ చేయడానికి అంగీకరించాను. కానీ సెట్‌లో జరిగిన పరిణామాలు నన్ను షాక్కు గురిచేశాయి” అని ప్రియ పేర్కొన్నారు. షూటింగ్‌కు ముందు అనుకున్నదానికి, సెట్‌లో జరిగిన దానికి పొంతన లేకుండా పోయిందని ప్రియా బాపట్ వెల్లడించారు. ఒక పాట చిత్రీకరణ సమయంలో సదరు సహనటుడు కథ పరిధిని దాటి ప్రవర్తించాడని, తన ప్రమేయం లేకుండానే పదే పదే ముద్దు పెట్టుకున్నాడని తెలిపారు. ఆ సమయంలో అకస్మాత్తుగా జరిగిన ఆ పరిణామానికి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆ అసౌకర్యకర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా ప్రతిగుటించాలో కూడా అర్థం కాలేదని నిస్సహాయతను వ్యక్తం చేశారు. కేవలం సెట్‌లోనే కాకుండా, వెలుపల కూడా ఆ నటుడి నుండి వేధింపులు ఎదురయ్యాయని ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ నిమిత్తం తామిద్దరం భోపాల్లోని ఒకే హోటల్లో వేర్వేరు గదుల్లో బస చేశామని, ఆ సమయంలో తాను ఎంత తిరస్కరిస్తున్నా వినకుండా.. కలిసి బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ చేద్దామంటూ సదరు నటుడు పదే పదే ఒత్తిడి తెచ్చాడిని ఆమె వివరించారు.

అండగా నిలిచిన భర్త..

ఈ వరుస పరిణామాలతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు ప్రియా బాపట్ తెలిపారు. ప్రతిరోజూ రాత్రి షూటింగ్ ముగిసిన తర్వాత ముంబైలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి కన్నీరు పెట్టుకునేదాన్నని చెప్పారు. భార్య పడుతున్న ఇబ్బందిని గమనించిన ఉమేష్, తక్షణమే స్పందించి ముంబై నుండి భోపాల్‌కు విమానంలో చేరుకున్నారని తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆయన సెట్లోనే తనతో పాటు ఉన్నారని, ఆ తర్వాతే తాను ప్రశాంతంగా షూటింగ్‌ను పూర్తి చేయగలిగానని ప్రియ వివరించారు. తన కెరీర్లో అలాంటి ఘోరమైన అనుభవం ఎదురవ్వడం అదే మొదటి, చివరిసారి అని ఆమె స్పష్టం చేశారు. మరాఠీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ప్రియా బాపట్.. 'కాక్ స్పర్మ్', 'హాపీ జర్నీ' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాగే సోని లివ్‌లో ప్రసారమైన సేటీ ఆఫ్ డ్రీమ్స్', 'రాత్ జవాన్ హై' వంటి వెబ్ సిరీస్ల ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

Next Story