‘స్వయంభు’ కోసం 45 రోజుల కఠిన శ్రమ.. గాయాలైనా వెనక్కి తగ్గని నిఖిల్

by Pulgam srinivas |

‘స్వయంభు’ సినిమా కోసం నిఖిల్ 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుని, విలువిద్య, కత్తి విన్యాసాలు, యుద్ధ పోరాటాలు నేర్చుకున్నాడు.

‘స్వయంభు’ కోసం 45 రోజుల కఠిన శ్రమ.. గాయాలైనా వెనక్కి తగ్గని నిఖిల్
X

దిశ, వెబ్ డెస్క్: వైవిధ్యమైన కథాంశాలతో రూపొందే చిత్రాల్లో నటిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వారిలో నిఖిల్ ఒకరు. ‘కార్తికేయ 2’ చిత్రంతో ఆయనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇక చాలా కాలం క్రితమే నిఖిల్ ‘స్వయంభు’ అనే భారీ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాకు భారత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. నిన్న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

ఆ వీడియోలో ఈ సినిమా కోసం నిఖిల్ 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్న విధానాన్ని చూపించారు. ముఖ్యంగా విలువిద్య, కత్తి విన్యాసాలు, యుద్ధ పోరాటాలు ఎలా నేర్చుకున్నారో, ఆ శిక్షణలో గాయాలపాలైనా వెనక్కి తగ్గకుండా ఎంత కష్టపడ్డారో వివరించారు. ఈ వీడియో చూసిన అనంతరం నిఖిల్ ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నారు. మరి ‘స్వయంభు’ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన్ సాగర్, శ్రీకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై చిత్రం నిర్మితమవుతోంది. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Next Story