పేషెంట్ల ప్రాణం తీసిన కరోనా భయం

by  |
పేషెంట్ల ప్రాణం తీసిన కరోనా భయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భయం వారి ప్రాణాలను బలిగొన్నది. ఆస్పత్రులకు వెళితే కరోనా వెంటాడుతుందేమోనని చాలా మంది లివర్ పేషెంట్లు సర్జరీలకు దూరంగా ఉన్నారు. చికిత్స చేయించుకోవడంలో ఎడతెగని జాప్యం చేశారు. దీంతో బాధితులలో సగం మంది చనిపోయారని గ్లోబల్ ఆస్నత్రి అధ్యయనంలో తేలింది. కొందరు మాత్రం ధైర్యంగా డాక్టర్ల పర్యవేక్షణలో విజయవంతంగా కాలేయ మార్పిడి చేయించుకుని తమ ప్రాణాలను నిలుపుకొన్నారు.

కరోనా వైరస్ దీర్ఘకాలిక రోగులకు తీరని నష్టం కలిగించింది. ప్రధానంగా కాలేయ‌ మార్పిడి వెంట‌నే అవ‌స‌ర‌మైన రోగులలో స‌గం మంది కొవిడ్ స‌మ‌యంలో చేయించుకోక‌పోవ‌డంతో మ‌ర‌ణించారు. ఆసుప‌త్రికి వ‌స్తే త‌మ‌కు కరోనా సోకుతుంద‌న్న భ‌యంతోనే వారు ఆప‌రేష‌న్లు స‌రైన స‌మ‌యానికి చేయించుకోలేదని గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్య బృందం ప‌రిశీల‌నలో తేలింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్ విధించిన‌ప్పుడు, ఆ త‌ర్వాతి కాలంలో 48 మంది రోగుల‌కు కాలేయ‌ మార్పిడి అత్యవ‌స‌రంగా చేయాల్సి వ‌చ్చింది. వారిలో 23 మంది వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో ఉండి కొవిడ్ సోకకుండా విజ‌య‌వంతంగా కాలేయ‌ మార్పిడి శ‌స్త్రచికిత్సలు చేయించుకున్నారు. కొవిడ్ సోకిన ఏడుగురు రోగుల‌కు కూడా విజ‌య‌వంతంగా కాలేయ‌ మార్పిడి చేశారు. 13 మంది రోగులు త‌మ‌కు వైర‌స్ సోకుతుంద‌న్న భ‌యం, ఇత‌ర కార‌ణాల‌తో చికిత్సలు వాయిదా వేసుకున్నారు. ఆ ఆల‌స్యంతో మ‌ర‌ణించారు. మిగిలిన ఐదుగురు శ‌స్త్ర చికిత్సల‌కు సిద్ధమైనా, వారికి కొవిడ్ సోకి కాలేయ‌ మార్పిడి చేయించుకోక‌ముందే మ‌ర‌ణించారు! నిజానికి వారి మ‌ర‌ణానికి ప్రధాన కార‌ణం కాలేయ‌ మార్పిడి స‌మ‌యానికి జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మేనని వైద్య బృందం తేల్చింది.

శస్త్రచికిత్సకు ఆలస్యమే కారణం

కాలేయం ప‌రిస్థితి విష‌మించిన‌ప్పుడు, అవయవ మార్పిడి త‌ప్ప రోగికి వేరే మార్గం లేన‌ప్పుడు, శ‌స్త్రచికిత్స ఆల‌స్యం చేస్తే ప్రాణాపాయం సంభ‌వించే ప్రమాదం ఉంటుందని గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి క్లినిక‌ల్ హెడ్, సీనియ‌ర్ క‌న్సల్టెంట్, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జన్ డాక్టర్ రాఘ‌వేంద్రబాబు అన్నారు. క‌రోనా సోకుతుంద‌న్న భ‌యంతో కొంద‌రు రోగులు, కుటుంబీకులు ఈ చికిత్సల‌ను ఆల‌స్యం చేశారన్నారు. దీంతో కొంతమంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. కాలేయ ప‌రిస్థితి విష‌మించిన‌ప్పుడు మార్పిడి శ‌స్త్రచికిత్సల‌కు ఆల‌స్యం చేయ‌డం మంచిది కాదన్నారు. గతేడాది జూన్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు ల‌క్డీకాపుల్‌లోని గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రిలో 30 కాలేయ‌ మార్పిడి శ‌స్త్ర చికిత్సలు చేశామన్నారు. అవ‌న్నీ వందశాతం విజ‌య‌వంతం అయ్యాయన్నారు.

నాడీ సంబంధ సమస్యలు

కొవిడ్ రోగులకు ల‌క్షణాలు ర‌క‌ర‌కాలుగా ఉంటాయి. వారిలో కొంద‌రికి శ్వాస‌ప‌ర‌మైన ఇబ్బందులుంటే మ‌రికొంద‌రికి నాడీ సంబంధ స‌మ‌స్యలుంటాయి. ఆసుప‌త్రుల‌లో చేరిన క‌రోనా రోగుల్లో కొంద‌రికి కాలేయ ఎంజైములు పెర‌గ‌డం క‌నిపించిందని డాక్టర్ చెప్పారు. అయినా దానికి చికిత్స చేయొచ్చు. కాలేయ‌ మార్పిడి శ‌స్త్రచికిత్స జ‌రిగిన త‌ర్వాత త‌క్కువ నుంచి ఒక మాదిరి క‌రోనా ల‌క్షణాలు వ‌చ్చిన వాళ్లు మాత్రం ఇమ్యునోస‌ప్రెష‌న్ మందుల వాడ‌కం కొన‌సాగించాలన్నారు. ఈ అంశాల‌న్నింటి దృష్ట్యా కాలేయ‌ మార్పిడి శ‌స్త్రచికిత్సల‌ను వెంట‌నే చేయించుకోవాల‌ని, వైద్యులు చెప్పిన‌ప్పుడు రోగులు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆల‌స్యం చేయ‌కూడ‌దన్నారు.



Next Story

Most Viewed