మేం చేసిన నేరమేంటి..?

by  |
మేం చేసిన నేరమేంటి..?
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనాపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కష్టపడి పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి రూ.7,500 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, వారితో పాటే పనిచేస్తున్న స్పోర్ట్స్ విభాగం చౌకీదార్లకు మాత్రం ఈ తరహా ప్రోత్సాహం లేదు. శానిటేషన్ కార్మికుల లాగానే చౌకీదార్లు కూడా జీహెచ్ఎంసీ నెలకొల్పిన తాత్కాలిక షెల్టర్లలో పారిశుధ్య పనులే చేస్తుంటారు. పేరుకు చౌకీదార్ అనే పోస్టే అయినా అక్కడి పారిశుధ్య పనులు చేయాల్సింది కూడా వీరే. స్టేడియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో పారిశుధ్యం వీరి బాధ్యత. కరోనా కారణంగా వీరికి కూడా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్క్‌లు, గ్లౌజులు ఇవ్వాల్సి ఉంది. కానీ, జీహెచ్ఎంసీ వీరి గురించి పట్టించుకోలేదు. ఇవే అందనప్పుడు ఏడున్నర వేల రూపాయల ప్రోత్సాహకం అందుతుందనకోవడం అత్యాశే.

ఎలాంటి రక్షణ లేకుండానే..
చౌకీదార్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్, విక్టోరియా గ్రౌండ్ తదితర స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లతో పాటు తాత్కలిక షెల్టర్లను శుభ్రం చేయడం, అక్కడ ఉన్నవారికి ఆహారం, నీళ్లు అందించడం వంటి పనులు చేస్తారు. బల్దియా స్పోర్ట్స్ విభాగం పరిధిలో సుమారు వంద మంది చౌకీదార్ల గురించి జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ కూడా పట్టించుకోలేదు. దీంతో వీరు ఎలాంటి రక్షణ లేకుండానే రోజువారీ పనులు చేస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రోత్సాహకం ఇచ్చినా రూ.7.50 లక్షలు మాత్రమే ఖర్చవుతది. కరోనా వైరస్‌పై పోరాటంలో తమను కూడా గుర్తించాలని ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీని కోరుతున్నారు. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మాస్క్‌లు, గ్లౌజులు ఇస్తున్నట్లుగానే తమకూ ఇవ్వాలని కోరుతున్నారు.

పనికి తగిన గుర్తింపునివ్వాలి..
లాక్‌డౌన్‌లో స్టేడియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో ఎలాంటి క్రీడలు జరగకపోయినా ఫుట్‌పాత్ మీద ఉండేవారిని, వలస కార్మికులను, నగరంలో సొంత ఇళ్లు లేకుండా రాత్రిపూట పడుకునేవారిని వీటిలో పెట్టారు. వందలాది మంది ఉంటున్నందున స్వీయ రక్షణ కోసం మాస్క్ లు, గ్లౌజులు తప్పనిసరి అవసరమని, అవి లేకపోవడంతో ఎప్పుడు కరోనా బారిన పడతామో అనే ఆందోళన వీరిని వెంటాడుతోన్నది. ఇంతమంది ఒకేచోట గుమిగూడినందున ముందుజాగ్రత్త చర్యగా కనీసం శానిటైజర్లు కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయలేదని ఓ చౌకీదార్ మహిళ వ్యాఖ్యానించింది. బల్దియా ఉన్నతాధికారులు మాస్క్‌లు, శానిటైజర్లను అందించాలని కోరుతున్నారు. తమ డ్యూటీలను సరిగా చేస్తున్నందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని కూడా అందించాలని మొరపెట్టుకున్నారు. పనికి తగిన గుర్తింపునివ్వాలని జీహెచ్ఎంసీ, స్పోర్ట్స్ విభాగం అధికారులను చౌకీదార్లు కోరుతున్నారు.


Next Story

Most Viewed