బాల్య మిత్రుడికి ఫ్యామిలీకి అండగా నిలిచిన దోస్తులు.. గ్రామస్తులు ఫిదా

by  |
Nalgonda
X

దిశ, హుజూర్ నగర్ : బడిలో కలిసి చదువుకుని ఇరవై ఏండ్లు గడిచినా తమ మిత్రున్ని మరచిపోలేదు.. చిననాటి స్నేహితుడు ఆకస్మికంగా చనిపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బాల్యమిత్రుని కుటుంబాన్ని ఓదార్చి అండగా నిలిచి స్నేహాన్ని అర్థం చెప్పారు ఆ స్నేహితులు. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన బాలబోయిన వెంకన్న బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం గుండెపోటుకు గురై ఆకస్మికంగా మరణించాడు.

చిన్న వయసులో భర్తను కోల్పోయిన అతని భార్య, ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉండగా.. మేమున్నామని ముందుకు వచ్చారు వెంకన్న బాల్య స్నేహితులు. సోషల్ మీడియాను వేదిక చేసుకుని తమ ఆర్ధిక భాగస్వామ్యంతో పాటుగా.. మిత్రులు, శ్రేయోభిలాషులను వెంకన్న కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. అందరి నుంచి రూ. 3,09,580‌ లను సేకరించారు.

ఆదివారం‌ స్నేహితుల దినోత్సవం సందర్భంగా రూ.1.5 లక్షలు వెంకన్న కూతురు కుసుమ పేరు మీద , రూ.50 వేలు కొడుకు సంజయ్ పేరు మీద పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ చేసి, బాండ్లు పిల్లలకు అందజేశారు. మరో 50 వేలతో వెంకన్న భార్య లక్ష్మి జీవనోపాధికై కిరాణం షాపు పెట్టించారు. మిగిలిన వాటిని ప్రస్తుత కుటుంబ అవసరాల కోసం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమలో ఒకరైన వెంకన్న కుటుంబానికి సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు.

అతనితో గడిపిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మిత్రులు సులువ శ్రీనివాస్, పోలిశెట్టి మహేష్ , రామిశెట్టి శ్రీనివాస్, సులువ చంద్రశేఖర్, షేక్ మజీద్, దుర్గాప్రసాద్, రాజశేఖర్, కృష్ణ, వెంకటేశ్వర్లు, రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed