- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్‌ఎస్‌లో రగులుతున్న ఆధిపత్య పోరు.. పార్టీ కార్యాలయం మూసివేత
<p>దిశ, భద్రాచలం: చర్లలో గ్రూపులు, పదవుల గొడవల మూలంగా మూతపడిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెరుచుకుంటుందా? లేక శాశ్వతంగా క్లోజ్ అవుతుందా? అనేది ప్రధాన చర్చనీయాంశమైంది. ఇంతకాలం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు విభేదాలు ప్రక్కన పెట్టి ఒక్కతాటిపైకి వచ్చి ఐక్యతారాగం ఆలపిస్తూ వచ్చే ఎన్నికలకు సన్నద్ధమౌతుండగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీలో పెత్తనం, పదవుల కోసం గ్రూపులుగా విడిపోయి, గొడవలు పడుతూ వీధికెక్కి ప్రజల్లో […]</p>

దిశ, భద్రాచలం: చర్లలో గ్రూపులు, పదవుల గొడవల మూలంగా మూతపడిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెరుచుకుంటుందా? లేక శాశ్వతంగా క్లోజ్ అవుతుందా? అనేది ప్రధాన చర్చనీయాంశమైంది. ఇంతకాలం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు విభేదాలు ప్రక్కన పెట్టి ఒక్కతాటిపైకి వచ్చి ఐక్యతారాగం ఆలపిస్తూ వచ్చే ఎన్నికలకు సన్నద్ధమౌతుండగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీలో పెత్తనం, పదవుల కోసం గ్రూపులుగా విడిపోయి, గొడవలు పడుతూ వీధికెక్కి ప్రజల్లో చులకనై చివరకు చర్లలో పార్టీ ఆఫీసు మూత వేసుకున్నారు.
స్వయంగా పార్టీ మండల అధ్యక్షుడే టీఆర్ఎస్ ఆఫీసుకి తాళం వేసి మూసివేయడం గమనార్హం. అధ్యక్షుని తీరుపై పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసు మూసి వేసినంత మాత్రాన పార్టీలో నాయకుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు, గొడవలు సద్దుమణుగుతాయా? అని గులాబీ శ్రేణులు మదనపడుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్య నాయకులే సరికొత్త సమస్యలు సృష్టిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలని పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది.
సెప్టెంబర్‌లో ప్రారంభం.. అక్టోబర్‌లో మూత
అధికార పార్టీకి కార్యాలయం కరువు శీర్షికన ‘దిశ’ దినపత్రికలో జులై 29న ప్రచురితమైన కథనం గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. దీంతో సెప్టెంబర్ 2న చర్లలో పోలీస్‌స్టేషన్‌కి ఎదురుగా పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఇంతలోనే పార్టీ సంస్థాగత ఎన్నికలు రావడంతో నాయకుల నడుమ ఆధిపత్యపోరు ఎక్కువైంది. పార్టీ అధ్యక్ష, కార్యదర్శి పదవుల విషయంలో రెండు గ్రూపులు పోటీపడ్డాయి. ఒక గ్రూపుకి అధ్యక్ష పదవి, మరో గ్రూపుకి కార్యదర్శి పదవి ఇచ్చారు. అధ్యక్ష, కార్యదర్శిలు కలిసి పనిచేస్తారని అందరూ అనుకునేలోపు పార్టీ అనుబంధ సంఘాల కమిటీ విషయంలో మళ్ళీ గ్రూపు గొడవలు రగిలాయి.
రాష్ట్ర కార్యదర్శి దృష్టికి కార్యాలయం పంచాయతీ
చర్లలో పార్టీ కార్యాలయాన్ని అధ్యక్షుడు మూసివేసిన విషయం బుధవారం చర్ల మండల పర్యటనకు వచ్చిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. ఎన్ని గొడవలు ఉన్నా కార్యాలయం మూసివేయడం కరెక్టు కాదని, వెంటనే ఆఫీసు తెరిపించమని ఆయన మండల అధ్యక్షుడు రాజారావుకి చెప్పినట్లు సమాచారం. సాయంత్రం వరకు కార్యాలయం తెరుచుకోకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ విషయమై “దిశ” టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోయం రాజారావుని వివరణ కోరగా.. నాయకులు కొట్టుకుంటారేమో అనే భయంతో తాత్కాలికంగా మూసివేశానని, త్వరలోనే కార్యాలయం తెరుచుకుంటుందని తెలిపారు.






