జగన్ గారూ.. నిజం చెప్పండి: చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిజాలను దాస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కరోనా వ్యాధి బాధితుల లెక్కలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాలను దాస్తున్నట్టుగా అనుమానం ఉందని అన్నారు. కరోనా విషయంలో నిజాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని కోరుతూ జగన్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రంలోని కరోనా పాజిటివ్‌ కేసులను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టడంలేదన్నారు. కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల్లో వైరస్ కారణంగా పలువురు మృత్యువాత పడినా ప్రభుత్వం [&hellip;]</p>

జగన్ గారూ.. నిజం చెప్పండి: చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిజాలను దాస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కరోనా వ్యాధి బాధితుల లెక్కలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాలను దాస్తున్నట్టుగా అనుమానం ఉందని అన్నారు. కరోనా విషయంలో నిజాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని కోరుతూ జగన్‌కు లేఖ రాశారు.

ఈ లేఖలో రాష్ట్రంలోని కరోనా పాజిటివ్‌ కేసులను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టడంలేదన్నారు. కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల్లో వైరస్ కారణంగా పలువురు మృత్యువాత పడినా ప్రభుత్వం బయటకు చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. లెక్క తక్కువగా చూపుతున్నారన్న భావన ప్రజల్లో ఉందని యన తెలిపారు. నిజాలను దాచిపెడితే పెనుప్రమాదం తప్పదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వైద్య పరీక్షలు పెంచి, పాజిటివ్‌ కేసులను గుర్తించి, సమస్య జటిలం కాకుండా చూడాలని బాబు సలహా ఇచ్చారు. వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. వైరస్ సోకిన వారిని ప్రజల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా చికిత్సలు చేయించాలని చంద్రబాబు తన లేఖలో డిమాండ్ చేశారు. ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, పేదలకు పౌష్టికాహారం కోసం అన్న క్యాంటీన్లను వినియోగంలోకి తేవాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ప్రజలెవరూ పస్తులుండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని వినియోగించుకుని, మూడు నెలలకు సరిపడా రేషన్‌, పింఛన్‌ ఒకేసారి పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం ఆదేశాలను రాష్ట్రం తప్పకుండా పాటించాలని ఆయన అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలు నిలపవద్దని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతుంటే, లాక్‌ డౌన్‌ పేరు చెప్పుకుని జగన్ ప్రభుత్వం, వేతనాల్లో కోత పెట్టడం, వాయిదా వేయడం మంచిది కాదని ఆయన లేఖ ద్వారా హితవు పలికారు. కాగా, చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Tags: chandrababu naidu, tdp, ysrcp, ys jagan, ap cm, babu letter to ap cm

Next Story