ఆ ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి తార్కాణం

by  |
ఆ ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి తార్కాణం
X

దిశ, ఏపీ బ్యూరో: నంద్యాలలో వైసీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకనే అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పార్లమెంట్ నియజకవర్గాల అధ్యక్షులు, పరిశీలకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… బంగారం దొంగతనం నేరంపై మొదట అబ్దుల్ సలాంను వారు వేధించినట్లు తెలిపారు. తర్వాత ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటే మళ్లీ వెంటాడారని తెలిపారు. ఆటోలో డబ్బులు పోయాయనే నేరం మోపారని చెప్పారు.

జైలుకు పంపిస్తామని బెదిరింపులు, భార్యను అసభ్యంగా దుర్భాషలాడటంతో కలత చెంది ప్రాణాలను తీసుకున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల బొమ్మూరులో పదేండ్ల ముస్లిం మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగితే బాధిత కుటుంబంపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు గుర్తు చేశారు. దీంతో రాజమండ్రి ఎస్పీ కార్యాలయం ముందు ఆమె తండ్రి అబ్దుల్ సత్తార్ పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం వాలంటీరు పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.

ఇంకా కడపలో అంగన్​వాడీ కార్యకర్తకు లైంగిక వేధింపులు, రాజమండ్రిలో 17ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్​రేప్​ లాంటి ఘటనలు రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలకు తార్కాణంగా చంద్రబాబు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్, కాలవ శ్రీనివాసులు, కే ఏ నాయుడు, బీసీ జనార్ధన్ రెడ్డి, లింగారెడ్డి, గణబాబు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నూకసాని బాలాజీ, గన్ని వీరాంజనేయులు, బీటీ నాయుడు, నెట్టెం రఘురామ్, అనంతకుమారి, గౌరు వెంకటరెడ్డి, పులివర్తి నాని పాల్గొన్నారు.


Next Story

Most Viewed