ఇకపై సబ్సిడీలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి.. కేంద్రం నయా ఆర్డర్స్!

87
power restoration

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై కేంద్రం ఫోకస్ పెట్టింది. శాఖలో నష్టాలను నివారించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ స్కీమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ మేరకు బుధవారం కేంద్ర సహాయ కార్యదర్శి తన్మయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ శాఖలో 2024-25 సంవత్సరం నాటికి 12 నుంచి 15 శాతం ఉన్న విద్యుత్ లీకేజీలను సున్నా శాతానికి తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు గాను రూ.3,03,758 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. బడ్జెట్‌లో రూ.97,631 కోట్లు పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో 31 మార్చి 2022 నాటికి రూ.17,000 కోట్లను అందించాలని కేంద్రం నిర్ణయించడమే కాకుండా ఈ స్కీమ్‌ను రెండు రకాలుగా విభజించింది.

డిస్కంలకు ఆర్థికంగా సాయం చేయడం, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు, సిస్టమ్ మీటరింగ్ విధానాన్ని అమలు పరచడం వంటి అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల డిస్కంలను యాక్షన్ ప్లాన్‌ను తయారు చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. విద్యుత్ సరఫరా, స్మార్ట్ మీటర్ల పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలో ప్రణాళిక రచించుకోవాలని సూచించింది. విద్యుత్ నష్టాలు ఎందుకు వస్తున్నాయో ఆయా డిస్కంలు విశ్లేషించుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆ నష్టాలను ఎలా తగ్గించాలి, ఏం చేస్తే ఆ నష్టాలు తగ్గుతాయోననే నివేదిక పంపించాలని తెలిపింది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశాక అవి ఎలాంటి పనితీరును కనబరిచాయి, ఆర్థికంగా నష్టాలను ఎలా అధిగమించాయి అనే అంశాలను కేంద్రం మంత్రిత్వ శాఖ నిర్ధారించనుంది.

స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాలంటే విద్యుత్ వినియోగదారులకు భారం తప్పదు. అందుకుగాను కేంద్రం రూ.900 భరించనుంది. డిసెంబర్ 2023 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేస్తే అదనంగా విద్యుత్ వినియోగదారులకు రూ.450 ఇన్సెంటివ్‌గా అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.17,000 కోట్లు మీటర్ల కోసం, రూ.23,000 కోట్లు ఇన్సెంటివ్ కోసం కేటాయించనుంది.

ఇదిలా ఉండగా ధోబీలు, లాండ్రీలు, సెలూన్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ డబ్బులను ఇకనుంచి నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలోనే జమచేసేలా కేంద్రం మార్పులు చేసింది. 2023 వరకు ప్రతిడిస్కం డిసెంబర్ చివరికల్లా వార్షిక ఆడిట్ రిపోర్ట్‌ను అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆపై ఈ వార్షిక నివేదికను సెప్టెంబర్ నాటికల్లా అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్ సిస్టమ్ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసిన డిస్కంలకు పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ను మార్కుల రూపంలో ప్రకటించాలని కేంద్రం నిర్ణయించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..