కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్..

by  |
కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ అనాలోచిత నిర్ణయాల వల్లే నేడు దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి.. 6 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం ఎంత వరకు సమంజసమో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అలాగే విదేశాల్లో తయారైన వ్యాక్సిన్ ను ఎందుకు దిగుమతి చేసుకోలేదో కేంద్రం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

దేశ జనాభాలో కేవలం ఏడు శాతం మందికే ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేశారన్నారు. ఇదిలా ఉండగా కొవిషీల్డ్ టీకా ధర కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400లకు అందిస్తామని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించడాన్ని ఇందిరాశోభన్ తప్పుబట్టారు. దేశ ప్రజలంతా ఒక్కటే అయినప్పుడు వేర్వేరు ధరలు నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం తమకు అనుకూల రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తూ.. తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించడం సరికాదన్నారు. రాష్ర్టానికి సరిపడా ఆక్సిజన్‌తో పాటు రెమిడిసివిర్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ఇందిరాశోభన్ పేర్కొన్నారు.

మరోవైపు.. కరోనా విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసే వరకు తెలంగాణ ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే హెల్త్ ఎమర్జెన్సీ కింద మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటింటికీ తిరిగి ఉచితంగా టీకాలు వేయాలని ఇందిరాశోభన్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని ఆమె సూచించారు.


Next Story

Most Viewed