టాటా మోటార్స్‌పై విచారణకు సీసీఐ ఆదేశాలు!

by  |
టాటా మోటార్స్‌పై విచారణకు సీసీఐ ఆదేశాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: డీలర్‌షిప్ ఒప్పందాలకు సంబంధించి దేశీయ అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌పై విచారణ చేపట్టేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆదేశించింది. అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఫిర్యాదులకు సంబంధించి ఈ విచారణ ఉంటుందని సంస్థ తెలిపింది. టాటా మోటార్స్, టాటా కేపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్‌లపై ఫిర్యాదులు వచ్చిన క్రమంలో సీసీఐ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. కాంపిటీషన్ చట్టంలోని సెక్షన్ 4లోని నిబంధనలకు విరుద్ధంగా టాటా మోటార్స్ వాహనాల డీలర్‌షిప్ ఒప్పందంలో అన్యాయమైన నిబంధనలు, షరతులు విధించడంతో ఫిర్యాదుదారులు ఇబ్బందులు పడుతున్నారని సీసీఐ అభిప్రాయపడింది. నిబంధలకు విరుద్ధంగా కొనసాగుతున్న కార్యకలాపాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సీసీఐ స్పష్టం చేసింది. ఈ అంశంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని డైరెక్టర్ జనరల్‌ను దర్యాప్తు విభాగం ఆదేశించింది. దీనిపై సీసీఐ ఆదేశాలు అందాయని, ఆర్డర్ కాపీపై సమీక్ష జరుపుతున్నామని, తదుపరి చర్యల కోసం న్యాయ సలహాదారులను సంప్రదిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.


Next Story