బడి ఎంత ప్రియమో...?

by Ravi |   (  Updated:2025-07-04 00:46:12  IST  )

విద్యా సంవత్సరం సమీపించిందంటే విద్యార్థులను సంతోషంగా పాఠశాలకు పంపాల్సిన తల్లిదండ్రులు ఆర్థిక భారంతో కుంగిపోతున్నారు.

బడి ఎంత ప్రియమో...?
X

విద్యా సంవత్సరం సమీపించిందంటే విద్యార్థులను సంతోషంగా పాఠశాలకు పంపాల్సిన తల్లిదండ్రులు ఆర్థిక భారంతో కుంగిపోతున్నారు. రాజ్యాంగం ప్రకారం విద్య ఒక ప్రాథమిక హక్కు. అది కొనుగోలు వస్తువు కాదు. అందరికీ అందుబాటులో ఉండాల్సిన వనరు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ‘బడి’ ఓ ఖరీదైన సరుకుగా మారిపోయింది. ప్రధానంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు మోయలేని భారంగా పరిణమించింది.

విద్యను వ్యాపార సరుకుగా చేసి..

తల్లిదండ్రుల ఆదాయంలో సగం పిల్లల చదువులకే ఖర్చవుతున్నాయి. వారి ఆశలు, విద్యార్థుల ఆశయాలను, ప్రైవేట్ విద్యాసంస్థలు సొమ్ముచేసుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అవసరం. దీన్ని ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు వ్యాపార సరుకుగా మార్చేశాయి. ఒక్కో విద్యా సంవత్సరం స్కూల్ ఫీజుతో పాటు యూనిఫామ్, బస్ చార్జీలు, క్యాపిటేషన్ ఫీజు, కంపల్సరీ కోచింగ్ ఫీజులు కలిపి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ప్రీ-ప్రైమరీ స్థాయిలోనూ రూ.50 వేల నుంచి రూ.లక్షకు మించి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ స్థాయిలో ఫీజులు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు దాటుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఏళ్లుగా పైసా పైసా కూడబెట్టిన పైసలు సగం వరకు పిల్లల చదువులకే ఖర్చు చేయాల్సి వస్తోంది.

ప్రభుత్వ బడులపై నమ్మకం లేదా?

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం, బోధనా సామర్థ్యంలో లోపాలు, పాఠ్యపుస్తకాల సరఫరాలో జాప్యం, లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలు విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం తగ్గిపోతుంది. ఇంగ్లీష్ మీడియం డిమాండ్‌తో అడ్మిషన్ల సంఖ్య క్షీణిస్తోంది. అంతేగాక విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ బోధనా సంస్థలు మాత్రమే కాదు. కోచింగ్ సెంటర్లు కూడా విద్యను ఖరీదు చేసే వస్తువుగా మార్చేశాయి. ‘సీటు’ కోసం పోటీ, 'ర్యాంకు' కోసం ఒత్తిడి – ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా, మానసి కంగా మరింతగా కుంగదీస్తున్నాయి. నాణ్యమైన విద్యను పొందాలంటే పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు లక్షలాది రూపా యల విద్యా రుణాలతో చదువు పూర్తి చేసి, ఆ తర్వాత సంవత్సరాల తరబడి వాటిని తీర్చడంతోనే సరిపోతుంది.

పరిష్కార మార్గాలు..

అందుకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు నియంత్రణ కమిటీలను చట్టబద్ధత కల్పించి సమర్థవంతంగా అమలు చేయాలి.. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంత ఫీజు వసూలు చేస్తున్నాయో పారదర్శకంగా ప్రకటించాలి. ఉపాధ్యాయుల నియామకాలను వేగవంతం చేయాలి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించాలి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యా రుణాలపై వడ్డీ మినహాయింపు ఇవ్వాలి. స్కాలర్‌షిప్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్ (డీబీటీ) వంటి విధానాలు అనుసరించాలి. విద్యను సృజనాత్మకత, విశ్లేషణ, నైపుణ్యాల అభివృద్ధి దిశగా మలచే ఎన్ఈపీని వాస్తవంగా అమలు చేస్తే, బహుళ ఫీజుల బందీ నుంచి విద్యార్థులు విముక్తి పొందే అవకాశం ఉంది. విద్య ఒక సామాజిక, ఆర్థిక, మానవ వనరు. అది సామాజిక సమానత్వానికి వేదిక. కానీ, చదువు అధిక ధరకు మారినప్పుడు, అది లక్షలాది మంది జీవితాలను తారుమారు చేస్తుంది. అందుకే ప్రభుత్వ విధానాలు ప్రజాహితంపై కేంద్రీకరించాలి. బడి భారంగా కాక, దేశ భవిష్యత్తు నిర్మాణానికి బలమైన పునాది కావాలి.

డా. రావుల కృష్ణ

94929 09371

Next Story