పార్టీ ఫిరాయించిన సీనియర్ ఎమ్మెల్యేపై కలకత్తా హైకోర్టు వేటు.. తెలంగాణ ఫిరాయింపులపై ఎఫెక్ట్!

by Prasad Jukanti |   (  Updated:2025-11-13 13:25:22  IST  )

పార్టీ ఫిరాయింపులపై కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

పార్టీ ఫిరాయించిన సీనియర్ ఎమ్మెల్యేపై కలకత్తా హైకోర్టు వేటు.. తెలంగాణ ఫిరాయింపులపై ఎఫెక్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : పార్టీ మారిన పశ్చిమబెంగాల్ సీనియర్ ఎమ్మెల్యే ముకుల్‌రాయ్‌కు కలకత్తా హైకోర్టు (Calcutta Hc) బిగ్ షాక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన ఆయనపై అనర్హత వేటు వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముకుల్‌రాయ్ బీజేపీ తరఫున కృష్ణానగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో టీఎంసీ అధికారంలోకి రావడంతో ఆయన 2021లో బీజేపీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు. పార్టీ మారిన ముకుల్‌రాయ్ (Mukul Roy Disqualification)ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని బీజేపీ 2022లో తొలుత పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా స్పీకర్ ఈ పిటిషన్‌ను తోసిపుచ్చారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-defection Law) కింద ఇవాళ జస్టిస్ దేబాంగ్స్ బసక్, జస్టిస్ ఎండీ షబ్బర్ రషీదిలతో కూడిన డివిజన్ బెంచ్ ముకుల్‌రాయ్‌పై అనర్హత వేటు వేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

తెలంగాణలో కీలక దశలో పిటిషన్ల విచారణ

పశ్చిమబెంగాల్‌లో అనర్హత వేటు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (Brs Mlas Defection) తరఫున గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్, బీజేపీ పోరాటం చేస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో గడ్డం ప్రసాద్‌ను సుప్రీంకోర్టు సూచించింది. అయితే గడువు ముగిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేననని మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ తాజా పిటిషన్‌పై వచ్చే సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యే ముకుల్‌రాయ్ విషయంలో కలకత్తా హైకోర్టు వేటు వేసిన నేపథ్యంలో తెలంగాణ ఫిరాయింపుల విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఉత్కంఠగా మారింది.

Next Story