- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hurun Billionaires List: వరల్డ్ టాప్-10 మంది కుబేరుల్లో ముకేశ్ లేరు.. 284 మంది చేతిలోనే ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా?
Hurun Billionaires List: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ..ప్రపంచంలోని అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్ : Hurun Billionaires List: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ..ప్రపంచంలోని అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద విలువ 13శాతం తగ్గింది. దీంతో రూ. 8.6 లక్షల కోట్లకు పరిమితమైంది. అయితే ఆసియాలో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచంలోనే సంపద విలువను గత ఏడాది వ్యవధిలో అధికంగా పెంచుకున్న వ్యక్తిగా నిలిచారు. ఆయన సంపద ఏకంగా రూ. 1లక్షకోట్లు పెరిగింది. దీంతో రూ. 8.4 లక్షల కోట్లకు ఆయన సంపద చేరుకుంది.
హురున్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. 2025 జనవరి 15తో ముగిసిన ఏడాది కాలానికి ఈ జాబితాను రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. కనీసం 1 బిలియన్ డాలర్ల సంపద ఉన్న వారికి చోటు లభించిన ఈ జాబితా ప్రకారం చూసినట్లయితే..284 మంది కుబేరులకు భారత్ నిలయంగా ఉంది. వీరి మొత్తం సంపద విలువ 10శాతం పెరిగి రూ. 98లక్షల కోట్లకు చేరింది. భారతదేశ జీడీపీలో ఈ విలువ మూడోవంతు. ఈ 284 మందిలో 109 మంది సంపద విలువ పెరిగింది. మిగతా 109 మంది సంపద తగ్గింది.
అయితే రిలయన్స్ గ్రూప్ ఇంధనం, రిటైల్ వ్యాపారాలు మునుపటి స్థానంలో రాణించకపోవడం, అమ్మకాల వృద్ధి నెమ్మదించడం, రుణాలు భారీగా పెరగడం వంటివి ముకేశ్ అంబానీ సంపద 13శాతం తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణల ప్రభావంతో గణనీయంగా అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు తగ్గాయి. గత ఏడాది కాలంలో వేగంగా కోలుకోవడం వల్ల గౌతమ్ అదానీ సంసద విలువ 13శాతం పెరిగింది. ఇక దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా హెచ్ సీఎల్ టెక్ వ్యవస్థాపకురాలు శివ్ నాడార్ తనయ, సంస్థ చైర్ పర్సన్ రోష్నినాడార్ నిలిచారు. రోష్నికి ఆమె తండ్రి నుంచి హెచ్ సీఎల్ లో 4శాతం వాటా బదిలీకావడంతో ప్రపంచవ్యాప్త మహిళాకుబేరుల్లో 5వ ర్యాంకులో నిలిచారు.
ఒక కుబేరుడి సగటు సంపదలో చైనాను భారత్ అధిగమించింది. భారత్ లో ఒక కుబేరుడి సగటు సంపద రూ. 34,514 కోట్లు. చైనాలో ఇది రూ. 29, 027కోట్లుగా ఉంది. ఇక నగరాల్లో చూసినట్లయితే ముంబైలో కుబేరుల సంఖ్యలో ఏడాదిలో 11 పెరిగి 90 చేరింది. అయితే ఆసియాలో కుబేరుల రాజధాని అనే కిరీటాన్ని ముంబై కోల్పోయింది. చైనాలోని షాంఘై సొంతం చేసుకుంది. ఇక ప్రపంచంలోనే అగ్రగామి కుబేరుడిగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నిలిచారు. ఆయన సంపద 82శాతం పెరిగి 420 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఈ సంవత్సరం హురున్ జాబితాలో ఏస్ బిలియనీర్లలో కొంతమంది వినోదం, క్రీడలు, సోషల్ మీడియా నిపుణులు కూడా ఉన్నారు. వారిలో గాయకులు జే-జెడ్, రిహన్న, టేలర్ స్విఫ్ట్, పాల్ మెక్కార్ట్నీ ఉన్నారు. బిలియనీర్ క్లబ్‌లో చోటు దక్కించుకున్న క్రీడా ప్రముఖులలో మైఖేల్ జోర్డాన్, టైగర్ వుడ్స్, ఫ్లాయిడ్ మేవెదర్, లెబ్రాన్ జేమ్స్, క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ ఉన్నారు. కాగా 'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఫర్ 2025' కూడా దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల మొత్తం సంపదలో గత సంవత్సరం 10 శాతం పెరుగుదలను చూపింది.






