IMF: ఐఎంఎఫ్ బోర్డులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న పరమేశ్వరన్ అయ్యర్‌

by S Gopi |

ఈ పదవిలో ఉన్న కె వి సుబ్రమణియన్ పదవీకాలం ముగిసేందుకు ఆరు నెలల ముందుగానే తొలగించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది.

IMF: ఐఎంఎఫ్ బోర్డులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న పరమేశ్వరన్ అయ్యర్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న జరగబోయే ముఖ్యమైన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సమావేశానికి పరమేశ్వరన్ అయ్యర్‌ను ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత ప్రతినిధిగా నామినేట్ చేసింది. ఈ పదవిలో ఉన్న కె వి సుబ్రమణియన్ పదవీకాలం ముగిసేందుకు ఆరు నెలల ముందుగానే తొలగించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న పరమేశ్వరన్ అయ్యర్‌ను ఐఎంఎఫ్ బోర్డులోనూ భారత్ తరపున తాత్కాలిక నామినీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టాలని కోరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌కు 7 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం జరిగే మొదటి సమీక్షతో పాటు, వాతావరణ స్థిరత్వ రుణ కార్యక్రమం కింద ఆ దేశానికి కొత్తగా 1.3 బిలియన్ డాలర్ల రుణం అందించే నిర్ణయం తీసుకోవడానికి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మే 9న సమావేశమవుతున్నందున ప్రభుత్వ నిర్ణయం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తోందని, ఈ విషయంలో దాయాది దేశం పాత్రపై తీవ్రమైన ఆరోపణల కారణంగా పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం అందించడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్తాన్ ప్రమేయం ఉందని భావిస్తున్న పెహల్‌గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రవాద దాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు మరణించిన కొన్ని రోజుల్లోనే ఐఎంఎఫ్ సమావేశం జరుగుతోంది. పరమేశ్వరన్ అయ్యర్‌ను ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించకపోతే, ఐఎంఎఫ్ సంస్థ నిబంధనల ప్రకారం ఈ స్థానాన్ని శ్రీలంకకు చెందిన హరిశ్చంద్ర పహత్ కుంబురే గెడారా భర్తీ చేసి ఉండేవారు.

కేబినెట్ నియామకాల కమిటీ 2025, ఏప్రిల్ 30 నుంచి కె వి సుబ్రమణియన్ సేవలను రద్దు చేసింది. ఆయన ఇకపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకపోవడంతో మే 2న జరిగిన సమావేశాన్ని ఆయన రద్దు చేయాల్సి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సుబ్రమణియన్ ఐఎంఎఫ్ డేటాసెట్‌ల గురించి ప్రశ్నించారని, ఇది సంస్థకు నచ్చలేదని తెలుస్తోంది. గతంలోనూ సుబ్రమణియన్ చేసిన కొన్ని ప్రకటనలపై, ముఖ్యంగా భారత ప్రభుత్వం రుణ పరిస్థితికి సంబంధించి ఐఎంఎఫ్ అసంతృప్తిగా ఉందని సమాచారం.

Next Story