- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రూ. 2,000 నోట్లు మార్చుకునేందుకు రేపే ఆఖరు!
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) 2,000 నోట్లను మార్చుకునేందుకు ఇచ్చిన గడువు ముగిసేందుకు ఒక్కరోజే సమయం ఉంది. సెప్టెంబర్ 30వ తేదీలోగా పెద్ద నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత గడువు పెంపు అస్సలు ఉండదని కూడా పేర్కొంది. 2016లో నోట్ల రద్దు అనంతరం రూ. 2,000 నోట్లను ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా ఈ ఏడాది మే నెలలో వాటిని ఉపసంహరించుకుంది. ఆ సమయంలో ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకునేందుకు, లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నాలుగు నెలల గడువు ఇచ్చింది. అప్పటినుంచి సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 93 శాతం నోట్లు బ్యాంకులకు చేరాయని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 30లోగా నోట్లను మార్చుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నిర్దేశించిన గడువు తర్వాత రూ. 2,000 నోట్ల పరిస్థితి ఏంటి? అన్ని నోట్లు వెనక్కి రాకపోతే ఆర్‌బీఐ ఏం చేస్తుంది? తిరిగొచ్చిన నోట్లను ఏం చేస్తుందనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఆ వివరాలను తెలుసుకుందాం.!
ఇప్పటివరకు వచ్చిన నోట్లెన్ని..
సెప్టెంబర్ 1 నాటికి మార్కెట్లో చలామణీలో ఉన్న రూ. 2,000 నోట్లలో 93 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్‌బీఐ ప్రకటించింది. వీటి విలువ రూ. 3.32 లక్షల కోట్లు. బ్యాంకులకు తిరిగి వచ్చిన మొత్తం అన్ని నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో రాగా, మిగిలినవి ప్రజలు బ్యాంకుల నుంచి ఇతర నోట్లతో మార్చుకున్నారని ఆర్‌బీఐ వెల్లడించింది.
అన్ని నోట్లు తిరిగి రాకపోతే..
రూ. 2,000 నోట్ల మార్పిడికి గడువు ముగిసిన తర్వాత అవి చెల్లుబాటు కావు లేదా అక్రమమని ఆర్‌బీఐ ఎక్కడా ప్రకటించలేదు. దీన్ని బట్టి గడువు తేదీ దాటిన తర్వాత కూడా పెద్ద నోట్లకు చట్టబద్దత ఉంటుందని అర్థం. నిర్వహణ సౌలభ్యం కోసమే పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి గడువు తేదీ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్లను కలిగి ఉండటం చట్ట విరుద్దం ఏమీ కాదు. అయితే, నిర్దిష్ట గడువులోపు ఉపసంహరణ జరగకపోతే లీగల్ టెండర్‌గా వాటిని కొనసాగిస్తామని ఇదివరకు ఓ ప్రకటనలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. దాదాపు అన్ని నోట్లు వెనక్కి రావడంతో సెప్టెంబర్ 30 తర్వాత గడువు పెంచే అవకాశం ఉండదు. దీనిపై సెంట్రల్ బ్యాంక్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రేపటితో గడువు ముగుస్తుంది కాబట్టి దీనిపై ప్రకటన విడుదల అవ్వొచ్చు.
గడువు తర్వాత మార్చుకోవచ్చా?
మీ వద్ద ఇంకా రూ. 2,000 నోట్లు ఉంటే, వాటిని డిపాజిట్ చేసి మార్చుకోకపోతే, గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయండి. ఎందుకంటే, సెప్టెంబరు 30 తర్వాత ప్రజల వద్ద ఉన్న రూ. 2,000 నోట్ల పరిస్థితి ఏంటనే అంశంపై ప్రస్తుతానికి ఆర్‌బీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఆర్‌బీఐ రూ. 2,000 నోట్లను చట్టబద్ధంగా కొనసాగిస్తామని చెప్పిన విషయం గమనించడం ముఖ్యం. అంటే గడువు ముగిసిన తర్వాత కూడా రూ.2000 నోటు చట్టబద్ధంగా కొనసాగుతుంది.
గడువు ముగిసేలోపు డిపాజిట్ చేయని లేదా మార్చుకోని రూ. 2000 నోట్ల కోసం ఎటువంటి అవకాశాలు ఉంటాయనే అనే ప్రశ్న తలెత్తుతుంది. అంచనాకు..
* లావాదేవీలకు అవకాశం ఇవ్వకపోయినప్పటికీ, బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేసుకునేందుకు అనుమతించవచ్చు.
* ఇప్పటికే దుకాణాలు, వివిధ రకాల వ్యాపారులు వీటిని తీసుకోవడం మానేశారని గుర్తించుకోవాలి.
* మార్పిడి సదుపాయాన్ని అందుబాటులో ఉంచవచ్చు కానీ ఆర్‌బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌ల ద్వారా ఆర్‌బీఐ తన స్వంత కార్యాలయాలలో మాత్రమే మార్చుకునేందుకు అనుమతించవచ్చు.
రూ. 2,000 నోట్లను ఏం చేస్తారు..
ప్రజల వద్ద నుంచి వెనక్కి వచ్చిన రూ. 2,000 నోట్లను ఆర్‌బీఐ ముందుగా పరిశీలించి, నకిలీ, అసలు వాటిని విడదీస్తుంది. అందులో పూర్తిగా పాడైన వాతిని కాల్చేస్తారు. కొంచెం ధ్వంసం అయిన వాటిని చిన్న ముక్కలుగా చేసి వస్తువుల తయారీకి, బాగున్న వాటిని ఇతర కరెన్సీ నోట్ల తయారీకి వాడతారు. ఇదివరకు 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ ఇదే తరహా నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంది.
ఇవి కూడా చదవండి : రేపటి నుంచి బ్యాంకులకు 19 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..?