గాంధీ కుటుంబం కోసం ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఖర్గేపై అమిత్ షా విమర్శలు

by Dishanational6 |
గాంధీ కుటుంబం కోసం ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఖర్గేపై అమిత్ షా విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీపైనా, ప్రధాని మోడీపైన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. గాంధీ కుటుంబం కోసం అబద్ధాలు చెప్పవద్దని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కట్గోరాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేపై విమర్శలు గుప్పించారు.

జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్నికల్లో ఓటమికి గానూ గాంధీ కుటుంబం మల్లికార్జున్ ఖర్గేను నిందిస్తుందని హెచ్చరించారు. మోదీ అధికారంలోకి వస్తే పేదలు నాశనమవుతారని ఖర్గే చెబుతున్నారని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ వల్ల పేదరికం నుంచి 25 కోట్ల మందికి లబ్ధి చేకూరలేదా అని ప్రశ్నించారు. 80 కోట్ల మందికి రేషన్ ఇవ్వట్లేదా అని అడిగారు. 12 కోట్లు మరుగుదొడ్ల నిర్మాణం, గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తాగునీటి సరఫరా, 7 కోట్ల మందికి ఆరోగ్య బీమా ఇవన్నీ బీజేపీ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు.

గాంధీ కుటుంబం కోసం ఖర్గే ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని అమిత్ షా ప్రశ్నించారు. జూన్ 4న వచ్చే ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమిని చవిచూస్తుందన్నారు. రాహుల్, ప్రియాంక సురక్షితంగానే ఉంటారు కానీ.. ఓటమికి బాధ్యుడిగా ఖర్గేను నిందిస్తారని పేర్కొన్నారు.

Next Story