ఈవీఎంల నిర్వహణ ప్రొటొకాల్‌లో మార్పులివీ..

by Dishanational4 |
ఈవీఎంల నిర్వహణ ప్రొటొకాల్‌లో మార్పులివీ..
X

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) నిర్వహణకు సంబంధించిన ప్రొటొకాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసింది. ప్రత్యేకించి సింబల్ లోడింగ్ యూనిట్ల (ఎస్‌ఎల్‌యూ) నిర్వహణ, నిల్వతో ముడిపడిన నిబంధనను సవరించింది. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత కూడా 45 రోజుల పాటు ఎస్‌ఎల్‌యూలను సీల్ చేసిన కంటైనర్‌లో భద్రపర్చాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలను, మానవ వనరులను సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధాన అధికారులను ఆదేశించామని ఈసీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఎల్‌యూల నిర్వహణ, నిల్వపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వారికి నిర్దేశించింది. మనం ఈవీఎంలో ఓటు వేయగానే.. దాని పక్కనే ఉండే ఓటర్ వేరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) యంత్రంలో అభ్యర్థి గుర్తు, పేరు లోడ్ అవుతుంది. ఇలా లోడ్ కావడానికి వీవీ ప్యాట్‌కు సహకారం అందించే పరికరమే సింబల్ లోడింగ్ యూనిట్. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితం వెలువడిన తర్వాత ఎస్‌ఎల్‌యూలను ఏ విధంగా టెస్ట్ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Next Story