- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: త్వరలో రూ. లక్ష మార్కు దాటనున్న గోల్డ్
అమెరికా, చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా చాలామంది సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు కొత్త రికార్డులను అధిగమిస్తూ దూసుకెళ్తూనే ఉంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం తర్వాత రూ. 1,850 పెరిగిన స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 98,251 ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. దీంతో బంగారం ధరలు తొలిసారిగా 98 వేల మార్కును అధిగమించాయి. అమెరికా, చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా చాలామంది సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీని ఫలితంగానే బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 97,760గా ఉంది. ఆభరణల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 88,150గా ఉంది. వెండి కిలో రూ. 1,10,000 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో సైతం బంగారం ధరలు కొత్త రికార్డులను దాటేస్తున్నాయి. బుధవారం గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్ 3,318 డాలర్లకు చేరింది. దీంతో తొలిసారి బంగారం 3,300 మార్కును అధిగమించింది. ఇది గడిచిన ఏడాది కాలంలో 40 శాతం పెరిగింది. యూఎస్ వాణిజ్య విధానాలపై అనిశ్చితి, క్షీణిస్తున్న అమెరికా డాలర్ విలువ, సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్ కారణంగానే ఇంత వేగవంతమైన పెరుగుదల ఉందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
త్వరలో రూ. లక్ష మార్కు
గడిచిన వారం రోజులుగా పెరుగుతున్న బంగారం తాజాగా రూ. 98 వేల మైలురాయిని కూడా దాటింది. ఈ క్రమంలో ట్రాంప్ టారిఫ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ధరలను మరింత పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను కొనసాగించడం కూడా ధరల పెరుగుదలను ప్రభావితం చేస్తున్నాయి. వీటితో పాటు అమెరికా ఫెడ్ మరో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఫలితంగా మరికొద్దిరోజుల్లో బంగారం రూ. లక్ష చేరుకుంటుందని అంచనా.






