- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock market: రికార్డు లాభాలు ఒక్కరోజుకే పరిమితం.. మళ్లీ నష్టపోయిన సూచీలు
ప్రధానంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ కంపెనీల షేర్లలో అమ్మకాల కారణంగా ఒత్తిడి ఎక్కువగా కనబడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు సోమవారం గడిచిన నాలుగేళ్లలోనే తొలిసారి అతిపెద్ద సింగిల్-డే ప్రాఫిట్స్ చూశాయి. అయితే, ఈ భారీ లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. మంగళవారం అంతకుముందు రోజు వచ్చిన లాభాల్లో దాదాపు సగం పాయింట్లను కోల్పోయాయి. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ కారణంగా ర్యాలీ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాలు పెరిగాయి. ప్రధానంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ కంపెనీల షేర్లలో అమ్మకాల కారణంగా ఒత్తిడి ఎక్కువగా కనబడింది. ఇదే సమయంలో తాజాగా అమెరికా, చైనా మధ్య సఖ్యత కుదిరి, ఇరు దేశాలు సుంకాలను తగ్గించాయి. కానీ, ఆ రెండు దేశాల మధ్య ఏర్పడిన ఒప్పందం వల్ల భారత వాణిజ్యానికి ప్రత్యేకంగా లభించే ప్రయోజనాలు ఉండవనే సంకేతాలు నష్టాలకు మరో కారణం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మంగళవారం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు స్వల్పంగా 0.3 శాతం పెరిగి 65.18 డాలర్లకు చేరుకోవడం, అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి పెరగడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పుంజుకుంది. వీటికి తోడు కీలక ఐటీ రంగం షేర్లలో అమ్మకాలు మన మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1281.68 పాయింట్లు పతనమై 81,148 వద్ద, నిఫ్టీ 346.35 పాయింట్లు నష్టపోయి 24,578 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.34 వద్ద ఉంది.






