- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CKYC: అన్ని ఆర్థిక అవసరాలకు ఒకే కేవైసీ.. అదే సీకేవైసీ
ఆ సమాచారం సెర్సాయ్ నిర్వహించే ఒక కేంద్ర రిజిస్ట్రీలో నిల్వ చేస్తారు. ఆయా సంస్థలు ఒక ప్రత్యేకమైన 14-అంకెల సీకేవైసీ నంబర్‌ను ఉపయోగించి దాన్ని యాక్సెస్ చేయవచ్చు

దిశ, బిజినెస్ బ్యూరో: మనదేశం ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థలలో ఒకదాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల బ్రాంచ్‌కు వెళ్లకుండానే బ్యాంకు ఖాతా తెరవవచ్చు. స్మార్ట్‌ఫోన్ నుంచే పెట్టుబడి పెట్టవచ్చు, ట్రేడ్ చేయవచ్చు, బీమా చేయించుకోవచ్చు, లోన్ కూడా తీసుకోవచ్చు. మీ ఐడెంటిటీ ఒకసారి వెరిఫై జరిగితే చాలు, దాన్ని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. అదే కేవైసీ ప్రక్రియ. ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లాంటి డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా బ్యాంకు అకౌంట్ లేదా ఇతర ఆర్థికపరమైన పనులు జరుగుతాయి. అయితే, ఇందులో కూడా ఒక సమస్య ఉంది. మీరు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, కేవైసీ పూర్తి చేస్తారు. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు, మళ్ళీ కేవైసీ. ఏదైనా ఫిన్‌టెక్ యాప్‌లో సైన్ అప్ అవుతారు, మళ్ళీ కేవైసీ. కొన్ని నెలల తర్వాత, ఇప్పటికే వెరిఫికేషన్ కోసం కేవైసీ ఇచ్చిన చోట మళ్లీ కేవైసీ 'అప్‌డేట్' చేయమని అడుగుతారు. ఇలా మళ్లీ మళ్లీ కేవైసీ ఇచ్చే పనికి బ్రేక్ వేస్తూ తెచ్చిన విధానమే సెంట్రల్ కేవైసీ(సీకేవైసీ). ఏంటీ సీకేవైసీ, ఎలా పని చేస్తుంది, దీనికోసం ఏం చేయాలి లాంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
సీకేవైసీ అంటే
ఇప్పటివరకైతే ఎక్కువమందికి కేవైసీ, ఈ-కేవైసీ గురించి తెలుసు. కానీ, చాలా తక్కువమందికి సీకేవైసీ గురించి తెలుసు. ప్రతి బ్యాంకు, బీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ లేదా బ్రోకర్‌కు ఐడెంటిటీ డాక్యుమెంట్లను విడివిడిగా సమర్పించే బదులు, ఒక కస్టమర్ కేవైసీని ఒక్కసారి పూర్తి చేస్తే సరిపోతుంది. ఆ సమాచారం సెర్సాయ్ నిర్వహించే ఒక కేంద్ర రిజిస్ట్రీలో నిల్వ చేస్తారు. ఆయా సంస్థలు ఒక ప్రత్యేకమైన 14-అంకెల సీకేవైసీ నంబర్‌ను ఉపయోగించి దాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఆర్ధికశాఖకు చెందిన సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా(సెర్సాయ్)' అనే సంస్థ ఈ సీకేవైసీ నిర్వహిస్తుంది. ఈ సీకేవైసీ నంబర్‌ను 'కిన్' నంబర్ అని కూడా అంటారు. కిన్ అంటే కేవైసీ ఐడెంటిఫైయర్ నంబర్ అని అర్థం.
బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు ఇతర ఆర్థిక కార్యకలాపాల కోసం ఆధార్, పాన్ బదులుగా సీకేవైసీ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఆధార్, పాన్ వంటి వివరాలు అటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. ఈ ఒక్క నంబర్‌తో కేవైసీ ప్రక్రియను సులభంగా పూర్తి చేయొచ్చని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు.
సీకేవైసీ ప్రయోజనాలు
అవసరమైన ప్రతీసారి కేవైసీ డాక్యుమెంట్స్ ఇచ్చే బదులుగా వినియోగదారులు సులభంగా సీకేవైసీ విధానాన్ని రూపొందించారు. సీకేవైసీ వినియోగదారుల వివరాలు సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రర్‌లో స్టోర్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ కాకుండా డీమ్యాట్, ఫిన్‌టెక్ యాప్‌లలో సైన్-అప్ లాంటి పనులకు ప్రతీసారి కేవైసీ వివరాలు ఇవ్వాల్సిన పని ఉండదు. సదరు ఆర్థిక సంస్థలు వినియోగదారుల కేవైసీ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రరీ నుంచి తీసుకుంటాయి. దీనివల్ల వినియోగదారులకు పని భారం తప్పుతుంది. అంతేకాకుండా..
* మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో, లేదా ఇతర కేవైసీ పత్రాలు ఇవ్వాల్సిన ఆర్థిక కార్యకలాపాల్లో సీకేవైసీ నంబర్ ఇవ్వడం ద్వారా నేరుగా వెళ్లి ఆధార్, పాన్ కార్డు డూప్లికేట్ కాపీ ఇవ్వాల్సిన పని ఉండదు.
* దీనివల్ల డేటా చోరీ, మోసం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
* సీకేవైసీ నంబర్ ఉండటం వల్ల కేవైసీ ప్రక్రియ మరింత వేగవంతం పూర్తవుతుంది.
* సీకేవైసీ నంబర్ ఒక్కసారి పొందితే పదేపదే పత్రాలు సమర్పించే అవసరం తప్పుతుంది. సమయం కూడా ఆదా అవుతుది.
* మరీ ముఖ్యంగా మన వ్యక్తిగత సమాచారం ఎవరూ డూప్లికేట్ చేయలేరు. ఈ ప్రక్రియలో ఒక దరఖాస్తుదారుకి ఒకటే కేవైసీ గుర్తింపు ఉంటుంది.
* ఒకవేళ కేవైసీలో మార్పులు జరిగితే ఆర్ధిక సంస్థలకు సమాచారం అందుతుంది. వినియోగదారులే ఏవైనా మార్పులు చేయాలంటే అందుకు సంబంధించిన ఆధారాలను ఇస్తే సంస్థ వివరాలను పరిశీలించి మార్పులు చేస్తుంది.
సీకేవైసీ నంబర్ పొందడమెలాగంటే..
* మీరు నేరుగా సీకేవైసీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుండదు. దీనికోసం ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
* దీనికోసం ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. అందులో సీకేవైసీ సెక్షన్‌కు వెళ్లి ఫామ్ నింపాల్సి ఉంటుంది.
* ఆ తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోతో పాటు డిజిటల్ సంతకం కూడా స్కాన్ చేయాల్సి ఉంటుందనే విషయం మర్చిపోకూడదు.
* దరఖాస్తును సమర్పించిన తర్వాత, మీ వివరాలను పరిశీలించి సెర్సాయ్ డేటాబేస్‌కు పంపిస్తారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు 14 అంకెల సీకేవైసీ నంబర్ కేటాయిస్తారు.






