J&J: రూ. 53 వేల కోట్లతో జాన్సన్ అండ్ జాన్సన్ భారీ సెటిల్‌మెంట్

by S Gopi |

టాల్క్ ఆధారిత బేబీ పౌడర్, ఇతర ఉత్పత్తుల వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ దాఖలైన 76,000 కేసులను పరిష్కరించుకోవడానికి కంపెనీ రూ. 52,670 కోట్లకు పైగా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

J&J: రూ. 53 వేల కోట్లతో జాన్సన్ అండ్ జాన్సన్ భారీ సెటిల్‌మెంట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అండాశయ క్యాన్సర్‌కు కారణమైందన్న ఆరోపణలతో కంపెనీని చుట్టుముట్టిన వేలాది కేసుల నుంచి బయటపడేందుకు హెల్త్ కేర్ దిగ్గజం 'జాన్సన్ అండ్ జాన్సన్'(జేఅండ్‌జే) ఎట్టకేలకు రూ. వేల కోట్లతో సెటిల్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టాల్క్ ఆధారిత బేబీ పౌడర్, ఇతర ఉత్పత్తుల వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ దాఖలైన 76,000 కేసులను పరిష్కరించుకోవడానికి కంపెనీ సుమారు 5.5 బిలియన్ డాలర్లు (రూ. 52,670 కోట్లకు పైగా) చెల్లించేందుకు ప్రతిపాదిత ఒప్పందం కుదుర్చుకుంది. యూఎస్ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన ఈ 'ప్రొడక్ట్ లయబిలిటీ' వివాదంలో భాగమైన బాధితులలో 95 శాతం మంది అంగీకరిస్తే ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది. క్లెయిమ్‌దారుల తుది సంఖ్యను బట్టి ఈ మొత్తం ఏకంగా 7 బిలియన్ డాలర్ల(రూ. 67,038 కోట్ల)కు పెరిగే అవకాశం ఉంది.

కోర్టు బయట ఒప్పందం

గతంలో ప్రయత్నించిన దివాలా పిటిషన్ల దారిలో కాకుండా, నేరుగా పిటిషనర్ల న్యాయవాదులతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారా 2027, 2028 సంవత్సరాల్లో దశలవారీగా నష్టపరిహారాన్ని క్రెడిట్ చేయనున్నారు. ఈ ఒప్పందం కేవలం ఇప్పటివరకు నమోదైన పాత కేసులకు మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్తు క్లెయిమ్‌లను ఇందులో చేర్చలేదని కంపెనీ స్పష్టం చేసింది. దీనివల్ల సుదీర్ఘకాలం కాకుండా కేవలం 18 నెలల వ్యవధిలోనే బాధితులకు తక్షణ ఆర్థిక పరిహారం అందనుంది. బాధితుల న్యాయవాదులు కూడా ఈ ఒప్పందాన్ని అత్యంత న్యాయమైన పరిష్కారంగా అభివర్ణించారు.

క్యాన్సర్ ఆరోపణలు.. సుదీర్ఘ న్యాయపోరాటం

కంపెనీ విక్రయించే టాల్క్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే 'ఆస్బెస్టాస్' ఆనవాళ్లు ఉంటాయని, దీనివల్ల క్రమంగా అండాశయ క్యాన్సర్ వస్తుందని బాధితులు, 1950ల నాటి కంపెనీ అంతర్గత పత్రాలను సాక్ష్యాలుగా చూపుతూ కోర్టులను ఆశ్రయించారు. గతంలో మిస్సోరి కోర్టు జ్యూరీ విచారణలో ఏకంగా 2.1 బిలియన్ డాలర్ల(రూ. 19 వేల కోట్లకు పైగా) జరిమానాను కూడా జేఅండ్‌జే ఎదుర్కొంది. అయితే, దశాబ్దాల శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం తమ కాస్మొటిక్ టాల్క్ సురక్షితమని, ఉత్పత్తుల్లో ఎలాంటి ఆస్బెస్టాస్ లేదని కంపెనీ వాదిస్తూనే ఉంది. అయినప్పటికీ, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ లీగల్ ఖర్చులు భరించడం కంటే, క్లెయిమ్‌లను ముగించి కంపెనీ హెల్త్‌కేర్ వ్యాపారంపై దృష్టి పెట్టడమే ఉత్తమమని భావించి ఈ చారిత్రాత్మక పరిష్కారానికి అంగీకరించింది.

Next Story