డాలర్ ప్రవాహమే కీలకం.. ఆనాటి సంక్షోభానికి నో చాన్స్

by Naga Rani Yarlagadda |

రూపాయి విలువ తగ్గుతోంది. ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. విదేశీ పెట్టుబడులు కూడా స్థిరంగా లేవు.

డాలర్ ప్రవాహమే కీలకం.. ఆనాటి సంక్షోభానికి నో చాన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో : రూపాయి విలువ తగ్గుతోంది. ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. విదేశీ పెట్టుబడులు కూడా స్థిరంగా లేవు. దేశంలో ఈ మూడు పరిణామాలు ఎదురైనప్పుడల్లా చాలామందికి 1991 నాటి ఆర్థిక సంక్షోభం గుర్తుకొస్తుంది. అప్పట్లో విదేశీ మారక నిల్వలు ఖాళీ కావడంతో భారత్ బంగారాన్ని తాకట్టు పెట్టి అత్యవసర రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే 2026లో భారత్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దేశం వద్ద ప్రస్తుతం దాదాపు 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇవి సుమారు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. సేవల ఎగుమతులు, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు పంపే రెమిటెన్సులు కూడా ప్రతి ఏడాది భారీగా విదేశీ మారకాన్ని తీసుకొస్తున్నాయి. అయితే ఇలాంటి బలమైన పరిస్థితుల్లో కూడా ఆర్థికవేత్తలు విదేశీ పెట్టుబడులపైనే దృష్టి పెడుతున్నారు. దీనికి సమాధానం ఏంటంటే.. ఇప్పుడు సమస్య డాలర్ల కొరత కాదు, దేశంలోకి డాలర్లు నిరంతరం వస్తాయా లేదా అన్నదే అసలు ప్రశ్న.

డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయ్..?

ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఒక దేశం ఎగుమతుల ద్వారా సంపాదించే డాలర్ల కంటే.. దిగుమతుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తే దాన్ని ‘కరెంట్ అకౌంట్ లోటు’ (సీఏడీ) అంటారు. అయితే ప్రస్తుతం ఈ లోటు పెద్ద సమస్య కాదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఆ లోటును భర్తీ చేయడానికి ఎలాంటి డబ్బు దేశంలోకి వస్తోందనేదే అసలు విషయమని చాయిస్ వెల్త్ సీఈఓ నికుంజ్ సరఫ్ చెబుతున్నారు. అంటే భారత్‌కు డాలర్లు అవసరం అవుతూనే ఉంటాయి. కానీ ఆ డాలర్లు దేశంలోకి ఎలా వస్తున్నాయన్నదే ఇప్పుడు కీలకం.

విదేశీ పెట్టుబడులే ఎందుకు ముఖ్యం..

భారత్‌కు విదేశాల నుంచి రెండు ప్రధాన మార్గాల్లో పెట్టుబడులు వస్తాయి. ఒకటి ఎఫ్‌డీఐ, రెండు ఎఫ్‌పీఐ. విదేశీ కంపెనీలు భారత్‌లో ఫ్యాక్టరీలు నిర్మించడం, తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం లేదా కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేయడం ద్వారా వచ్చే ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ). ఇది దీర్ఘకాలిక పెట్టుబడి. ఒకసారి వచ్చిన తర్వాత వెంటనే వెనక్కి వెళ్లదు. ఎఫ్‌పీఐ అనేది స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెట్లలోకి వచ్చే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడి. ఇది చాలా వేగంగా వస్తుంది, అంతే వేగంగా బయటకు కూడా వెళ్లిపోతుంది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగినా, వడ్డీ రేట్లు మారినా లేదా పెట్టుబడిదారుల భావోద్వేగాలు మారినా ఎఫ్‌పీఐ ఒక్కసారిగా దేశం విడిచిపోవచ్చు. అందుకే ఆర్థికవేత్తలు ఎఫ్‌డీఐని స్థిరమైన పెట్టుబడిగా, ఎఫ్‌పీఐని అస్థిర పెట్టుబడిగా పరిగణిస్తారు.

నాటికీ.. నేటికీ ఎంతో తేడా..

రూపాయి బలహీనపడినప్పుడల్లా 1991 సంక్షోభం చర్చకు రావడం సహజమే. కానీ ఇన్ఫోర్మిక్స్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ మనోరంజన్ శర్మ ప్రకారం.. నాటి, నేటి పరిస్థితులకు అసలు పోలికే లేదు. 1991లో భారత్ వద్ద కొన్ని వారాల దిగుమతులకు సరిపోయే డాలర్లు కూడా లేవు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

- దాదాపు 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి.

- సేవల ఎగుమతులు బలంగా ఉన్నాయి.

- రెమిటెన్సులు భారీగా వస్తున్నాయి.

- అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం పెరిగింది.

రూపాయిపై ఒత్తిడి..

1991లో కొన్ని వారాలకు సరిపడా డబ్బులు కూడా లేవు, కానీ ఇప్పుడు మన దగ్గర మెరుగైన నిధులు ఉన్నాయి. కాకపోతే విదేశీ పెట్టుబడులు తగ్గినప్పుడు మార్కెట్లో డాలర్ల సప్లై తగ్గి రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అయితే రూపాయి మరీ పడిపోకుండా కాపాడటానికి మన ఆర్‌బీఐ తన దగ్గరున్న డాలర్లను మార్కెట్లో విడుదల చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తోంది. మన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నా.. ఇటీవలి అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల తగ్గింపు మనకు పెద్ద ఊరటనిచ్చింది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో చమురు ఒక్కటే కాదు.. విదేశీ పెట్టుబడులు, రూపాయి కదలికలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా భారత్‌కు కీలకంగా మారాయి.

Next Story