Economic Survery: ఆర్థిక సర్వేపై మొదటిసారిగా ప్రస్తావించిన 'పవర్ గ్యాప్ ఇండెక్స్'.. అసలేంటిది?

by S Gopi |   (  Updated:2026-02-11 12:26:11  IST  )

తొలిసారిగా ఆర్థిక సర్వే 'పవర్ గ్యాప్ ఇండెక్స్‌' అనే మాటను ప్రస్తావించింది. ఈ ఇండెక్స్‌లో భారత్ స్థానం గురించి చర్చించింది.

Economic Survery: ఆర్థిక సర్వేపై మొదటిసారిగా ప్రస్తావించిన పవర్ గ్యాప్ ఇండెక్స్.. అసలేంటిది?
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్థిక సర్వే-2026 గురువారం విడుదలైంది. ఇది సాధారణ బడ్జెట్ ముందు పత్రం లాగా కాకుండా ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబించేదిగా ఉంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ గందరగోళం, సరఫరా సమస్యలు, బలహీనపడుతున్న ప్రపంచ క్రమం నేపథ్యంలో, మనదేశం ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను, అనిశ్చితిని అధిగమించి భారత్‌కు ఉన్న అవకాశాలను సర్వే సూచించింది.

అయితే, తొలిసారిగా ఆర్థిక సర్వే 'పవర్ గ్యాప్ ఇండెక్స్‌' అనే మాటను ప్రస్తావించింది. ఈ ఇండెక్స్‌లో భారత్ స్థానం గురించి చర్చించింది. ఆర్థిక సర్వే ప్రకారం, భారత్ పవర్ గ్యాప్ స్కోరు -4.0, ఇది రష్యా, ఉత్తర కొరియాను మినహాయించి ఆసియాలోనే అత్యల్పంగా ఉంది. దీనర్థం, ఉన్న సామర్థ్యం కంటే భారత్ తక్కువగా పని చేస్తోందని పేర్కొంది. అయితే, సర్వేలో చెబుతున్న ఈ 'పవర్ గ్యాప్ ఇండెక్స్' ఎంటీ.. ఇది ఎందుకు ముఖ్యమైనది? తెలుసుకుందాం..

పవర్ గ్యాప్ ఇండెక్స్ అంటే

పవర్ గ్యాప్ ఇండెక్స్ అనేది హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ లేదా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లాగా స్వతంత్ర సూచీ కాదు. ఇది ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ రూపొందించే వార్షిక ర్యాంకింగ్. పవర్ గ్యాప్ ఇండెక్స్ ఒక దేశం వాస్తవ ప్రపంచంలో తన బలాన్ని ఎంత బాగా ఉపయోగిస్తున్నదనే విషయాన్ని సూచిస్తుంది. సులభంగా చెప్పాలంటే, ఒక దేశానికి పెద్ద ఎత్తున వనరులు ఉన్నప్పటికీ, పరిమితంగా వాటిని ఉపయోగిస్తే, దానికి ప్రతికూల పవర్ గ్యాప్ ఉంటుంది. అదే వనరులను ఎక్కువగా ఉపయోగిస్తే, దానికి సానుకూల పవర్ గ్యాప్ ర్యాంకింగ్ లభిస్తుంది.

ఎలా పనిచేస్తుంది

ఈ ఇండెక్స్ ఆస్ట్రేలియాలోని లోవీ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ నుంచి వచ్చింది. ఇది రెండు విషయాలను పరిశీలిస్తుంది. వనరులు (డబ్బు, సైనిక శక్తి, స్థిరత్వం), ప్రభావం (వాణిజ్య సంబంధాలు, దౌత్యం, రక్షణ భాగస్వామ్యాలు, సంస్కృతి). పవర్ గ్యాప్ అంటే అంచనా వేసిన ప్రభావం (వనరుల ఆధారంగా), వాస్తవ ప్రభావం మధ్య వ్యత్యాసం. నెగటివ్ స్కోర్ అంటే దేశం దాని సామర్థ్యాన్ని తక్కువగా ఉపయోగిస్తోందని అర్థం.

భారత్ విషయంలో

భారత పవర్ గ్యాప్ స్కోర్ –4.0, అంటే మనదేశం ఇప్పుడున్న ఇన్‌ఫ్లుయెన్స్ కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆసియాలో మనదేశం ఇప్పుడు ఒక ప్రధాన శక్తిగా ఉంది. కానీ, నిర్ణయాలను ప్రభావితం చేయడానికి, బలమైన భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, ఆసియా ప్రాంతంలో నాయకత్వం వహించడానికి అవసరమైన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లేదు. జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి కొన్ని చిన్న దేశాలు భారత్ కంటే తమ వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి.

ఆర్థిక సర్వే దీన్ని ఎందుకు ప్రస్తావించింది?

ఈ అంశంలో విధానపరమైన సందేశాన్ని పంపడానికే ఆర్థిక సర్వే పవర్ గ్యాప్ ఇండెక్స్‌ను ప్రస్తావించింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, తన ఆర్థిక బలాన్ని మరింత స్ట్రాటజిక్ ఇన్‌ఫ్లుయెన్స్‌గా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఏం చేయాలి

పవర్ గ్యాప్ ఇండెక్స్‌లో భారత్‌కు నెగెటివ్ ర్యాంకింగ్ అంటే ఇంకా మెరుగైన అవకాశాలు మనదేశానికి ఉన్నాయని అర్థం. ఆర్థిక భాగస్వామ్యాలు, రక్షణ సంబంధాలు, దౌత్యం, లీడర్‌షిప్ అవకాశాలను బలోపేతం చేయాలని సర్వే చెబుతోంది. భారత్ ఈ అంతరాన్ని తగ్గించగలిగితే, గ్లోబల్ ప్లేయర్‌గా మారే ఛాన్స్ ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది.

Next Story