- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gen Z: ఖర్చు చేయడంలో జెన్‌జీల కొత్త ట్రెండ్
గరిష్టంగా నెలకు 200 లావాదేవీలను దాటుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: అవసరానికి ఖర్చు చేయడం మామూలే. కొన్నిసార్లు అంతకు మించి చేయడం కూడా తప్పదు. అయితే, ఇదంతా పాత పద్దతి. ఇప్పటి యువత, జెన్‌జీ తరం కొత్త తరహా ఖర్చుల ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఫిన్‌టెక్ యాప్ సూపర్.మనీ భారత్‌లోని జెన్‌జీ తరం రోజువారీ ఖర్చులను ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై అధ్యయనం చేసింది. యూపీఐ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, చిన్న మొత్తం కొనుగోళ్లు, క్రెడిట్ వినియోగం వంటి అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా యువత ఆర్థిక అక్షరాస్యతపై సూపర్ మనీ యాప్ వివరాలను సేకరించింది. దీని ద్వారా జెన్‌జీ యువత డబ్బును ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై స్పష్టం వస్తుంది. దేశంలో ఆన్‌లైన్ సేవలను ముందు తరం కంటే చాలా వేగంగా జెన్‌జీలు వినియోగిస్తున్నారు. అందుకే వారు డిజిటల్ చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ సేవలను ఉపయోగించే వారిలో 72 శాతం మంది 28 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే ఉండటం గమనార్హం. చాలామందికి జెన్‌జీలు ఖర్చుల విషయంలో ఉదాసీనంగా ఉంటారని భావిస్తారు. కానీ, వారే అత్యంత క్రమశిక్షణతో, వ్యూహాత్మకంగా డబ్బును వాడుతున్నారని నివేదిక అభిప్రాయపడింది. ఆర్థిక లక్షయాలకు అనుగుణంగా జెన్‌జీలు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ లావాదేవీల్లోనూ క్యాష్‌బ్యాక్‌లకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి ఖర్చులో ఎంతో కొంత లబ్ది ఉండే అవకాశాలనే వారు ఎంచుకుంటున్నారు.
స్కాన్-ఫస్ట్ జనరేషన్
డిజిటల్ చెల్లింపులు జెన్‌జీలకు రెండవ సాధారణ అలవాటుగా మారింది. 74 శాతం మంది నెలకు 50 కంటే ఎక్కువ డిజిటల్ చెల్లింపులు చేస్తారు. గరిష్టంగా నెలకు 200 లావాదేవీలను దాటుతున్నాయి. వీటిలో అత్యధికంగా క్యూఆర్ కోడ్ ఆధారంగా చేసే లావాదేవీలే ఉన్నాయి. ముఖ్యంగా క్యాబ్ బుక్ చేయడమైనా, బిల్లుల చెల్లింపులైనా రోజువారీ ఖర్చులకు క్యూఆర్ కోడ్ చెల్లింపులకే ఎక్కువ ఇష్టపడుతున్నారు.
తెలివైన పొదుపు
జెన్‌జీలు అత్యధికంగా యూపీఐ చెల్లింపులే చేస్తున్నప్పటికీ, చేసే ఎలాంటి ఖర్చులైనా తక్కువ మొత్తంతోనే సర్దుబాటు చేసుకుంటున్నారు. 76 శాతం మంది జెన్‌జీలు చేసే చెల్లింపులు రూ. 2,000 దాటడం లేదు. ఇందులోనూ అత్యధికంగా 26.16 శాతం కిరాణా సరుకులు, ఫుడ్ కోసం 23.71 శాతం చేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని, అందుకు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడటం లేదని నివేదిక గుర్తించింది. వివిధ కోర్సుల సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లింపులు చేయడమే ఇందుకు నిదర్శనం.
నైట్ స్పెండింగ్
ఎక్కువ డిజిటల్ చెల్లింపులు చేయడమే కాదు చేసే విధానంలోనూ జెన్‌జీ ప్రత్యేకంగా ఉంటున్నారు. చేసే చెల్లింపుల్లో ఉదయం 6-11 గంటల మధ్య కిరాణా సరుకుల కోసం, ఆ తర్వాత సాయంత్రం 6-11 మధ్య ఫుడ్ కోసం ఎక్కువ చెల్లిస్తున్నారు. కొంతమంది అర్ధరాత్రి సమయంలో కూడా ఫుడ్ కోసం ఎక్కువ చెల్లింపులు చేస్తున్నారని నివేదిక పేర్కొంది.
మెట్రోల్లోనే అత్యధికం
దేశంలోని ప్రధాన నగరాల్లో, అదీ మెట్రో ప్రాంతాల్లో అత్యధిక మొత్తం లావాదేవీలు ఉదయం 6–11 గంటల మధ్య జరుగుతున్నాయి. ఇవి కిరాణా కోసం ఉన్నాయని నివేదిక తెలిపింది. లావాదేవీల విలువ పరంగా మెట్రోలు ఆధిపత్యం ఉన్నప్పటికీ, చిన్న పట్టణాల్లో కూడా జెన్‌జీలు డిజిటల్ చెల్లింపులకే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా టైర్-2, టైర్-4 పట్టణాల్లో 41 శాతం యూజర్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు.
వీకెండ్ మూడ్
మనదేశంలో చాలా నెమ్మదిగా విస్తరిస్తున్న ధోరణి వీకెండ్ స్పెండింగ్. ఇది శుక్రవారం సాయంత్రం 7–8 గంటల మధ్య ఎక్కువగా ఉంది. ఈ సమయంలో ప్రతి వారం అత్యధిక సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్నాయి.
జెన్‌జీలు రుణం తీసుకునే విధానంలో ఆలోచనాత్మక మార్పును కూడా ఈ అధ్యయనం హైలైట్ చేసింది. దాదాపు 45 శాతం మంది జెన్‌జీ కస్టమర్లు క్రెడిట్‌కు కొత్త. అయినప్పటికీ చాలామంది ఎఫ్‌డీ సంబంధిత సెక్యూర్డ్ కార్డులను ఇష్టపడుతున్నారు. ఇది క్రెడిట్ ప్రపంచంలోకి మరింత అవగాహన, జాగ్రత్త, క్రమశిక్షణతో అడుగుపెట్టడాన్ని సూచిస్తుంది.






