- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Middle East Crisis: పశ్చిమాసియా సంక్షోభంతో మండుతున్న చమురు ధరలు
సముద్ర మార్గాల్లోనూ యుద్ధ తీవ్రత పెరిగి చమురు నౌకల రవాణాకు అంతరాయం ఏర్పడితే బ్యారెల్ ముడి చమురు ధర రూ. 14 వేల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యం అంతటా సైనిక దాడులు, ప్రతీకార దాడుల వల్ల హర్ముజ్ జలసంధి ద్వారా షిప్పింగ్‌కు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా సోమవారం చమురు ధరలు 9 శాతం మేర పుంజుకున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా ప్రాంతం అగ్నిగుండంలా మారుతోంది. హర్మూజ్ జలసంధిని మూసేయడంతో నౌకల రవాణా ఆగిపోయింది. గల్ఫ్ తీరంలో మూడు చమురు ట్యాంకర్లపై దాడి జరిగింది. దీనివల్ల మరికొన్ని రోజుల పాటు రవాణా నిలిచిపోతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 78.52 డాలర్లు(మన కరెన్సీలో రూ. 7,190)గా ఉంది. తాజా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం, యుద్ధం 4-5 వారాలు కొనసాగితే ముడి చమురు ధరలు రూ. 9,500 నుంచి రూ. 11 వేల వరకు చేరవచ్చని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సముద్ర మార్గాల్లోనూ యుద్ధ తీవ్రత పెరిగి చమురు నౌకల రవాణాకు అంతరాయం ఏర్పడితే బ్యారెల్ ముడి చమురు ధర రూ. 14 వేల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. గణాంకాల ప్రకారం, ఏప్రిల్ నెల డెలివరీకి సంబంధించి బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 13 శాతం పెరిగి 82.37 డాలర్లకు చేరుకుంది, ఇది ఈ ఏడాది జనవరి తర్వాత అత్యధికం. కొందరు విశ్లేషకులు చమురు బ్యారెల్‌కు 90 డాలర్లు లేదా 100 డాలర్లకు కూడా చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
హార్ముజ్ జలసంధి ఎఫెక్ట్
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అనేక అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీనివల్ల అరబ్ దేశాల నుంచి సముద్ర మార్గంలో ముడి చమురు సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కీలక హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో, అరబ్ దేశాలు ఆసియా దేశాలకు ముడి చమురును రవాణా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఆయా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు మరింత పైపైకి వెళ్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సామాన్యుడిపై భారం
గతవారం వరకు బ్యారెల్ ముడి చమురు ధర 67 డాలర్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో 7 శాతానికి పైగా పెరిగి 78 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో సరుకు రవాణా రంగంపై ఎక్కువ ఎఫెక్ట్ ఉండనుంది. సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే, నిత్యావసరాల రేట్లు కూడా ప్రియం అవుతాయి. చమురు ధరల్లో నిరంతర పెరుగుదల ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ముప్పు కలిగిస్తుంది. తద్వారా ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుంది.
ఒపెక్ స్పందన
మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో ముడి చమురు సరఫరాపై అంతరాయంతో ఓపెక్ స్పందించింది. గ్లోబల్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏప్రిల్ నుంచి రోజుకు 2 లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురు ఉత్పత్తికి సిద్ధమని ప్రకటించింది.






