తిరుగులేని శక్తిగా భారత్‌...అమెరికా మ్యాగజైన్ వెల్ల‌డి

by velandi.Saikiran |   (  Updated:2026-03-22 21:07:15  IST  )

అమెరికాకు చెందిన మ్యాగజైన్ వాషింగ్టన్ ఎగ్జామినర్ భారత్‌కు సంపన్న దేశంగా ఎదిగే సామర్థ్యం అత్యధికంగా ఉందని అభిప్రాయపడింది.

తిరుగులేని శక్తిగా భారత్‌...అమెరికా మ్యాగజైన్ వెల్ల‌డి
X

తిరుగులేని శక్తిగా భారత్‌

- దేశ ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది

- ఇండియాకు అతిపెద్ద బలం యువతే

- అమెరికా మ్యాగజైన్ ‘వాషింగ్టన్ ఎగ్జామినర్’ వెల్లడి

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా భారత ఆర్థికవ్యవస్థ అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా మనదేశ ఆర్థిక వృద్ధిని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మ్యాగజైన్ ‘వాషింగ్టన్ ఎగ్జామినర్’ భారత్‌కు సంపన్న దేశంగా ఎదిగే సామర్థ్యం అత్యధికంగా ఉందని అభిప్రాయపడింది. భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి ఇది సాధ్యమని మ్యాగజైన్ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ప్రపంచదేశాలు భారత్‌ను ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా చూస్తున్నాయని వెల్లడించింది.

రెండు దశాబ్దాలుగా

వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదిక కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రధానంగా గడిచిన రెండు దశాబ్దాలను పరిగణలోకి తీసుకుని, 2003 నుంచి దేశ ఆర్థికవ్యవస్థ సగటు వార్షిక వృద్ధి రేటు 7 శాతానికి పైగా ఉందని పేర్కొంది. రాబోయే మరో 20 ఏళ్ల వరకు ఇదే వృద్ధి వేగాన్ని కొనసాగిస్తే దేశ తలసరి జీడీపీ 15,000 డాలర్లను దాటుతుంది. తద్వారా భారత్ అధిక-ఆదాయ పరిమితిని దాటేస్తుంది. దీనివల్ల భారత్ మిడిల్-ఇన్‌కమ్ ట్రాప్ నుంచి బయటపడుతుంది. ఈ స్థాయి వృద్ధితో మధ్య-ఆదాయ ట్రాప్‌లో చిక్కుకున్న బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను భారత్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

అవకాశాలివే

భారతదేశ వృద్ధి అవకాశాలకు అనుకూలంగా అధిక జనాభా, పెరుగుతున్న సాంకేతికత వినియోగం, పాలసీలు వంటివి మద్దతునిస్తున్నాయని వాషింగ్టన్ ఎగ్జామినర్ తెలిపింది. ముఖ్యంగా యువత భారత్‌కు ఉన్న అతిపెద్ద బలం. అమెరికా, చైనాల కంటే భారత్‌లో ఎక్కువ యువత ఉంది. వచ్చే దశాబ్దాల్లో గణనీయమైన సంఖ్యలో యువత శ్రామిక శక్తిలో ప్రవేశించనుంది. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ ధోరణి పటిష్టమైన దేశీయ మార్కెట్‌ను ఇస్తుంది. వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడే పరిస్థితి ఉండదు. ఈ ప్రయోజనాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి, ప్రస్తుతం దేశంలో రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఫలితంగా దేశంలో మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరాను బలోపేతం చేస్తుందని నివేదిక వివరించింది.

సరఫరా బలం

ఇదే సమయంలో ప్రపంచ సరఫరాలో జరుగుతున్న కీలక మార్పులు భారత్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాయని నివేదిక అభిప్రాయపడింది. పాశ్చాత్య, ముఖ్యంగా అమెరికాకు చెందిన కంపెనీలు కార్యకలాపాలను చైనా నుంచి భారత్‌కు తరలించే పనిలో ఉన్నాయి. యాపిల్ లాంటి దిగ్గజాలు భారత్‌లో వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా, టెక్నాలజీ మరో కీలకమైన స్తంభంగా ఉంది. దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు లక్షలాది మందిని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చాయి. దీనివల్ల పన్ను ఆదాయం పెరుగుతోంది. చిన్న వ్యాపారులకు నిధుల లభ్యత పెరిగి కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

Next Story