Flipkart: టికెటింగ్ మార్కెట్లోకి ఫ్లిప్‌కార్ట్

by S Gopi |   (  Updated:2026-04-20 14:01:53  IST  )

ఈ కొత్త సేవల ద్వారా సినిమా, మ్యూజిక్ కచేరీలు, ఇతర లైవ్ ఈవెంట్ల టికెట్లను విక్రయించే అవకాశం ఉంది.

Flipkart: టికెటింగ్ మార్కెట్లోకి ఫ్లిప్‌కార్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో కొత్త వ్యాపారంలోకి ప్రవేశించనుంది. లైవ్ ఈవెంట్లకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ టికెటింగ్ రంగంలోకి అడుగుపెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కొత్త సేవల ద్వారా సినిమా, మ్యూజిక్ కచేరీలు, ఇతర లైవ్ ఈవెంట్ల టికెట్లను విక్రయించే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రజల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా మ్యూజిక్ కన్సర్ట్స్, అంతర్జాతీయ టూర్లు, స్పోర్ట్స్ ఈవెంట్లకు భారీగా స్పందన లభిస్తోంది. దీంతో టికెట్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్లో ఉన్న బుక్‌మైషో, జొమాటో డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ మే నెలలో తన టికెటింగ్ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో ఫుడ్ డెలివరీ సేవలను కూడా ప్రయోగాత్మకంగా ప్రారంభించే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, త్వరలో ఐపీఓకు రావాలని భావిస్తున్న ఫ్లిప్‌కార్ట్ క్రమంగా వ్యాపార ప్రణాళికలను మారుస్తోంది. ఇప్పటికే హోల్డింగ్ కంపెనీని స్వదేశానికి తరలించగా, సీనియర్ మేనేజ్‌మెంట్ పునర్వ్యవస్థీకరణ, మింత్రా వ్యాపారాన్ని మరింత పటిష్టం చేయడం వంటి చర్యలు చేపడుతోంది.

Next Story