Volvo Cars: 3,000 మందిని తొలగించేందుకు సిద్ధమైన వోల్వో కార్

by S Gopi |

3,000 మందిని తొలగించాలని నిర్ణయించినట్టు సోమవారం ప్రకటనలో తెలిపింది.

Volvo Cars: 3,000 మందిని తొలగించేందుకు సిద్ధమైన వోల్వో కార్
X

దిశ, బిజినెస్ బ్యూరో: మారుతున్న మార్కెట్ పరిణామాలు, వాణిజ్య సుంకాలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోంటోంది. దీన్ని అధిగమించేందుకు స్వీడన్‌కు చెందిన ప్రముఖ వోల్వో కార్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల తొలగింపుపై దృష్టి సారించింది. అధిక ఖర్చులు, ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌లో తగ్గుదల కారణంగా కంపెనీ గత నెలలో కార్యకలాపాల పునర్నిర్మాణాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా 3,000 మందిని తొలగించాలని నిర్ణయించినట్టు సోమవారం ప్రకటనలో తెలిపింది. పెరిగిన ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 1.9 బిలియన్ డాలర్ల మేర ఖర్చులను తగ్గించాలని ఇటీవల కంపెనీ నిర్ణయం తీసుకుంది. కొత్త పెట్టుబడులను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇలాంటి సమయంలో తొలగింపులు కూడా అనివార్యమని కంపెనీ వివరించింది. ఈ తొలగింపులు ముఖ్యంగా ప్రధాన కార్యాలయం ఉన్న స్వీడన్‌లో ఉన్న ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం చూపుతాయని, అంతర్జాతీయంగా 15 శాతం మేర తొలగింపుల ప్రభావం ఉంటుందని కంపెనీ తెలిపింది. మొత్తంగా వాహన పరిశ్రమలో సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా వినియోగదారుల నుంచి తగ్గిన గిరాకీ, ప్రపంచ ఆటో పరిశ్రమలో వాణిజ్య సుంకాలపై పెరిగిన ఆందోళనలు ఇబ్బందిగా మారాయి. వీటి పరిష్కారానికి, నిధుల కేటాయింపు, ఖర్చులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వోల్వో కార్ సీఈఓ హాకన్ సాముల్సన్ పేర్కొన్నారు.

Next Story