Vodafone Idea: ఏజీఆర్ బకాయిలపై మరోసారి సుప్రీంకోర్టులో వోడాఫోన్ ఐడియా పిటిషన్

by S Gopi |

ముఖ్యంగా వడ్డీ, జరిమానాతో పాటు బకాయిలపై వడ్డీని మాఫీ చేయాలని అభ్యర్థించింది

Vodafone Idea: ఏజీఆర్ బకాయిలపై మరోసారి సుప్రీంకోర్టులో వోడాఫోన్ ఐడియా పిటిషన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల నుంచి ఉపశమనం కోరుతూ ప్రైవేట్ రంగ టెలికామ సంస్థ వొడాఫోన్ ఐడియా గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కంపెనీకి రూ. 30,000 కోట్లకు పైగా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యంగా వడ్డీ, జరిమానాతో పాటు బకాయిలపై వడ్డీని మాఫీ చేయాలని అభ్యర్థించింది. వొడాఫోన్ ఐడియా తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాలని కోరారు. పిటిషన్‌ను మే 19న విచారించనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. టెలికాం రంగంలో పోటీని కొనసాగించడానికి వొడాఫోన్ ఐడియా మనుగడ చాలా కీలకమని, కంపెనీ సొంతంగా ఆర్థిక భారాన్ని భరించలేకపోతోందని రోహత్గి కోర్టుకు విన్నవించారు. ఇటీవలి వడ్డీ బకాయిలలకు బదులు ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లను బదిలి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కంపెనీలో 49 శాతం వాటాను కలిగి ఉంది. ఇదివరకు ఫిబ్రవరిలో 2021 నాటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెలికాం కంపెనీలు పిటిషన్లు దాఖలు చేశాయి. లైసెన్సు రుసుము, స్పెక్ట్రమ్‌ ఛార్జీలకు సంబంధించిన బకాయిలు లెక్కించడంలో తప్పులు దొర్లాయని కంపెనీలు వాదనలు వినిపించాయి. ఆ సమయంలో టెలికాం విభాగం ఏజీఆర్ బకాయిల లెక్కింపును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నిర్ణయం వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలకు గట్టి దెబ్బ. ఎందుకంటే ఏజీఆర్ బకాయిలలో ఎక్కువ భాగం ఈ కంపెనీలదే. ఆర్థిక ఇబ్బందులు పెరిగిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా తాజా పిటిషన్ వేసింది.

Next Story